వైసీపీ వర్సెస్ టీడీపీ : మైండ్ గేమ్ పారట్లేదా ?
ఎవరు ఏ మాట అన్నారు దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నది కూడా బహు చక్కగా విశ్లేషించడంలో సగటు జనం బాగా ముందున్నారు.
By: Tupaki Desk | 21 May 2024 8:15 AM ISTఇది సోషల్ మీడియా యుగం. స్మార్ట్ ఫోన్ ఉన్న వాడి బుర్రలో ఒకేసారి పది సినిమాలు ఆడిస్తాడు. వ్యూహాలు ఎత్తుగడలూ అన్నీ కూడా ఈ రోజు బట్టబయలు అవుతున్నాయి. ఎవరు ఏ మాట అన్నారు దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నది కూడా బహు చక్కగా విశ్లేషించడంలో సగటు జనం బాగా ముందున్నారు.
దాంతో గత కాలం కాదు బాబోయ్ అని నేతలు తలలు పట్టుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఒక మాట అంటే అది నమ్మేసేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేని కాలం సాగుతోంది. ఇదిలా ఉంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈసారి 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా అలాగే 22 ఎంపీల కంటే మిన్నగా సీట్లు గెలుచుకోబోతున్నామని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు.
అది ఆయన అన్ని రకాల సర్వేలను నివేదికలను దగ్గర ఉంచుకుని ఐ ప్యాక్ ప్రతినిధులతో భేటీ వేసిన అనంతారం ఫుల్ కాన్ఫిడెన్స్ తోనే చెప్పారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మా నాయకుడు మభ్యపెట్టే ప్రయత్నం ఎపుడూ చేయరని ఉన్నది ఉన్నట్లుగానే చెబుతారు అని కూడా అంటున్నారు.
అయితే నిజానికి ఇది వైసీపీకి బూస్టింగ్ లాంటిది. కానీ ఇది ఆ పార్టీ శ్రేణులలో అనుకున్నంత ఉత్సాహం ఇవ్వడం లేదు అని అంటున్నారు. బడా నాయకులు కూడా దీనిని విశ్వసిస్తున్నారా అంటే డౌట్ అని అంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వారు కీలక నేతలు సైతం మౌనం పాటిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి చెప్పినది మైండ్ గేమ్ కోసమా అన్న చర్చ కూడా మొదలైంది.
అలా అనుకునే అంతా దానిని లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. అయితే సీఎం చెప్పిన తరువాత కూడా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ పెడుతున్న పోస్టింగులు చూస్తే వైసీపీలో అంతర్లీనంగా గుభ గుభలాడుతున్నట్లుగానే ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే టీడీపీ విషయమూ అలాగే ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన రోజే మేము గెలుస్తున్నామని ధీమాగా చెప్పారు. ఆ తరువాత నుంచి ఆ పార్టీ నేతలు సీనియర్లు నంబర్లతో సహా చెప్పారు. దీనిని కూడా టీడీపీ శిబిరం పెద్దగా పట్టించున్నట్లుగా లేదు అని అంటున్నారు. ఒకరికి ఒకరు పోటీగా చెప్పుకోవడానికి అంటున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా అన్నదే తమ్మ్ముళ్లకూ వస్తున్న సందేహంగా ఉందిట.
ఇంకో వైపు జనసేన అయితే తాము డబుల్ డిజిట్ గెలుస్తామని చెబుతోంది. అయితే ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఎంతవరకూ పరిస్థితులు సహకరించాయి. ఓట్ల బదిలీ ఎలా జరిగింది అన్న దగ్గరే నేతలు ఆలోచనలు ఆగుతున్నాయట. మొత్తానికి మైండ్ గేమ్ అని గతంలో అద్భుతమైన ఆయుధంగా ప్రయోగించి ప్రత్యర్ధులను నిర్వీర్యం చేసేవారు. వారు మనిషి ఎదురుగా ఉన్న మెదడు మాత్రం ప్రత్యర్ధుల వ్యూహాలతో చిక్కుకుని విలవిలలాడేది. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు అనే అంటున్నారు.
నిజంగా కౌంటింగ్ రోజు ఫలితాలు వచ్చాక మాత్రమే నమ్ముతామని రెండు పార్టీల నుంచి వస్తున్న మాటగా ఉంది. అలాగే సగటు జనాలు కూడా తాజాగా వస్తున్న అంచనాలు కానీ ఇప్పటిదాకా వచ్చిన ప్రీ పోల్ సర్వేలు కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు అనే అంటున్నారు. దీంతో సోషల్ మీడియా పుణ్యమాని మైండ్ గేమ్ కి కాలం చెల్లిందనే అంతా అంటున్నారు.
