Begin typing your search above and press return to search.

టీడీపీలో పెరిగిపోతున్న టెన్షన్... అందుకేనట...?

బాబు జైలు నుంచి ఇంటికి వచ్చి పదిహేను రోజులు అవుతున్నా పార్టీ మాత్రం అలాగే ఉంది. పెద్దగా యాక్టివిటీ అయితే లేదు

By:  Tupaki Desk   |   14 Nov 2023 2:30 AM GMT
టీడీపీలో పెరిగిపోతున్న టెన్షన్... అందుకేనట...?
X

తెలుగుదేశం పార్టీకి గడచిన రెండు నెలలుగా ఒక్కలా గడవడం లేదు. ఆందోళనతోనే ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఏకంగా అధినాయకుడు చంద్రబాబు కేసులలో చిక్కుకుని ఇంట్లో ఉండిపోయారు. టీడీపీకి సర్వం చంద్రబాబే. ఆయన డైరెక్షన్ లోనే పార్టీ మొత్తం పనిచేస్తుంది. బాబు జైలు నుంచి ఇంటికి వచ్చి పదిహేను రోజులు అవుతున్నా పార్టీ మాత్రం అలాగే ఉంది. పెద్దగా యాక్టివిటీ అయితే లేదు

దీనికి తోడు బాబుకు కోర్టుల పరంగా పెద్దగా రిలీఫ్ అయితే దొరకడం లేదు. దాంతో పార్టీ నేతలకు టెన్షన్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక చంద్రబాబు వైద్య చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ బెయిల్ గడువు ఈ నెల 28 సాయంత్రం అయిదు గంటలతో పూర్తి అవుతుంది. ఆ మీదట బాబు తిరిగి రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిందే అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బాబు తన మీద పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు విషయంలో సెక్షన్ 17 ఏ వర్తిస్తుంది అని పేర్కొంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ని ఆయన దాఖలు చేశారు. అయితే దాని మీద విచారణ పూర్తి అయింది. తీర్పు రిజర్వులో ఉంది. ఆ తీర్పు ఈ నెలాఖరులోగా వస్తుంది అని అంటున్నారు. దాని మీదనే టీడీపీ నేతలు కోటి ఆశలు పెట్టుకున్నారు అని అంటున్నారు.

ఒక వేళ క్వాష్ పిటిషన్ లో బాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం బాబుకు కొండంత రిలీఫ్ దక్కినట్లే. మిగిలిన కేసులుకూ అదే వర్తిస్తుంది. కానీ అలా జరుగుతుందా లేదా అన్నదే ఇపుడు టెన్షన్ గా ఉంది. వాటి వివరాలు ఇపుడు చూస్తే కనుక బాబు తనకు స్కిల్ స్కాం కేసులో పెట్టుకున్న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నీద విచారణ ఈ నెల 15కి జరగనుంది. ఆ బెయిల్ విషయంలో అనుకూలంగా తీర్పు వస్తే స్కిల్ స్కాం కేసు వరకూ బాబు రిలీఫ్ పొందుతారు.

ఇక బాబు మీద ఒకటి రెండూ కాదు చాలా కేసులు ఉన్నాయి. ఇసుక కుంభకోణం కేసు సీఐడీ ఆయన మీద పెట్టింది. దీని మీద ముందస్తు బెయిల్ కోసం బాబు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఈ నెల 22కి వాయిద పడింది. అలాగే ఫైబర్ నెట్ కేసులో బాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది. ఈ నెల 30కి ఈ కేసు విచారణ వాయిదా పడింది.

అలాగే అంగళ్ళు అల్లర్ల కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే దాని మీద హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో చంద్రబాబు ఏ వన్ గా ఉన్నారు. విచారణకు హాజరు కావాల్సి ఉంది అని అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో కూడా బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. దాని మీద హై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ నెల 22న తదుపరి విచారణ జరగనుంది.

బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యం పాలసీలో అక్రమ విధానాలకు పాల్పడ్డారు అంటూ సీఐడీ మరో కేసు పెట్టింది. దాని మీద కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ని బాబు హై కోర్టులో పెట్టుకున్నారు. దాని మీద తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది. మొత్తంగా చూస్తే బాబు మీద ఎనిమిదికి తగ్గకుండా కేసులు అయితే ఉన్నాయి.

ఇందులో ఒక్క అంగళ్ళు కేసులో మాత్రం ముందస్తు బెయిల్ లభించింది. మిగిలిన వాటి విషయంలో హై కోర్టు సుప్రీం కోర్టుల దాకా విచారణ సాగుతోంది. అందుకే అన్నింటికీ ఒక్కటే ఆశ అన్నట్లుగా క్వాష్ పిటిషన్ మీదనే టీడీపీ ఆశలన్నీ పెట్టేసుకుంది. మరి క్వాష్ పిటిషన్ కొట్టేస్తే టీడీపీ పీకల్లోతు కష్టాలల్లో పడినట్లే. ఇంకో వైపు మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తోంది. దాంతో టీడీపీలో ఏమీ పాలుపోవడంలేదు అని అంటున్నారు.