Begin typing your search above and press return to search.

రాజయ్యకు బాధ్యతలు.. అనర్హత వార్నింగ్ తో కేసీఆర్ మైండ్ గేమ్ షురూ!

కారణం ఏదైనా.. కొన్నేళ్లుగా పక్కన పెట్టేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను ఆయన అక్కున చేర్చుకున్నారు

By:  Tupaki Desk   |   15 April 2024 4:04 AM GMT
రాజయ్యకు బాధ్యతలు.. అనర్హత వార్నింగ్ తో కేసీఆర్ మైండ్ గేమ్ షురూ!
X

ఎత్తులు.. పైఎత్తులు రాజకీయాల్లో సహజం. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎత్తులెన్నో వేసిన గులాబీ బాస్ కేసీఆర్ కు ఇటీవల కాలంలో ఆయన ఎత్తులన్ని ఎదురుదెబ్బలుగా మారుతున్నాయి. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు ఆయన సామర్థ్యానికి.. సత్తాకు పరీక్షగా మారాయి. గడిచిన పదేళ్లుగా ఎదురులేని అధికారాన్ని చేతిలో ఉంచుకున్న ఆయనకు.. గడిచిన నాలుగు నెలలుగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల వేళ.. మరోసారి దిమ్మ తిరిగే షాక్ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

కారణం ఏదైనా.. కొన్నేళ్లుగా పక్కన పెట్టేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను ఆయన అక్కున చేర్చుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను మొదటి టర్మ్ లో అర్థాంతరంగా ఆయన పదవిని పీకేయటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా కేసీఆర్ పట్టించుకున్నది లేదు. ఇటీవల కాలంలో పార్టీకి చెందిన కడియం శ్రీహరి.. దానం నాగేందర్.. తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా పోరాటం షురూ చేస్తానంటూ కేసీఆర్ తాజాగా ప్రకటించారు.

ఆయన వ్యాఖ్యను వార్నింగ్ గా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ గులాబీ ఎమ్మెల్యేలు పలువురు హస్తం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. మిగిలిన వారికి అనర్హత వేటు పేరుతో వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ ఉప ఎన్నికకు రెఢీ కావాలంటూ రాజయ్యకు సూచన చేసినట్లుగా చెబుతున్నారు. నిజానికి ఇదే రాజయ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే.. అనూహ్యంగా సుధీర్ కుమార్ ను ఎంపిక చేయటం.. రాజయ్య కినుకు వహించటం తెలిసిందే.

అయితే.. పార్టీ నిర్ణయంపై రాజయ్య ఎలాంటి వ్యాఖ్య చేసింది లేదు. తాజాగా రాజయ్యను పిలిపించిన గులాబీ బాస్.. ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం ఉప ఎన్నికకు రెఢీ కావాలన్న కేసీఆర్.. రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంత కాలానికి రాజయ్యకు పార్టీలో గుర్తింపు లభించినట్లుగా పేర్కొంటున్నారు. ఇక.. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన వార్నింగ్ మొత్తం మైండ్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. మరి.. ఆయన వ్యాఖ్యలు ఏ మేరకు ప్రభావాన్ని చూపుతాయన్నది వేచి చూడాల్సిందే.