Begin typing your search above and press return to search.

‘తల్లికివందనం’ ఫైనాన్స్ కంపెనీల పంగ నామం!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘తల్లికివందనం’ కార్యక్రమానికి కొన్ని ఫైనాన్సు కంపెనీలు పంగనామం పెడుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Jun 2025 5:00 PM IST
‘తల్లికివందనం’ ఫైనాన్స్ కంపెనీల పంగ నామం!
X

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘తల్లికివందనం’ కార్యక్రమానికి కొన్ని ఫైనాన్సు కంపెనీలు పంగనామం పెడుతున్నాయి. ఈ పథకం కింద తల్లుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిన డబ్బును ఫైనాన్స్ కంపెనీలో ఖాళీ చేస్తున్నాయి. ఎప్పుడో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించినా, ఏవేవో కారణాలతో తమ అకౌంట్ల నుంచి డబ్బు లాగేస్తున్నారని కొంత మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బు ఇచ్చిందన్న ఆనందం లేకుండా చేస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఫైనాన్స్ కంపెనీల నిర్వాకంతో ప్రభుత్వానికి రావాల్సిన మంచిపేరు దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘తల్లికి వందనం’లో తమ అకౌంట్లకు జమ అయిన డబ్బులు ఓ ఫైనాన్స్ కంపెనీ లాగేసిందని అనంతపురం జిల్లాలో పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. గుంతకల్లు పట్టణంలోని పలువురు మహిళలు పోలీసులను ఆశ్రయించి తమ అకౌంట్ల నుంచి డబ్బు లాగేసిన ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీ వద్ద టీవీ, ఫ్రిడ్జ్ వంటివి కొనేందుకు ఫైనాన్స్ తీసుకున్నామని, ఈఎంఐలు అన్నీ చెల్లించినా, తమ అకౌంట్లలో జమ అయిన మొత్తం డబ్బును అన్యాయంగా తీసుకున్నారని మహిళలు ఫిర్యాదు చేశారు.

ఓ మహిళ టీవీ కొనుగోలు చేసి ఈఎంఐ చెల్లించలేదని, అయితే సదరు ఫైనాన్స్ కంపెనీ వారు టీవీని అప్పట్లోనే రికవరీ చేశారట. కానీ, ఇప్పుడు ఆమె అకౌంట్లో తల్లికి వందనం డబ్బు పడగానే ఆ మొత్తాన్ని తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదువు రాని వారి పేరున రుణాలిచ్చి ఏళ్లుగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆ ఫైనాన్స్ కంపెనీపై మహిళలకు ఫిర్యాదు చేశారు.