Begin typing your search above and press return to search.

రియల్ 'ఒకే ఒక్కడు'.. తమిళనాడులో దళపతి మార్క్ మాస్ రూలింగ్!

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ తనదైన శైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2026 4:00 PM IST
రియల్ ఒకే ఒక్కడు.. తమిళనాడులో దళపతి మార్క్ మాస్ రూలింగ్!
X

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ తనదైన శైలితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తొలి నుంచి హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయ్ గత ముఖ్యమంత్రులకు భిన్నంగా కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎం.సి. రాజా సోషల్ జస్టిస్ హాస్టల్‌ను ముఖ్యమంత్రి అకస్మాత్తుగా సందర్శించారు. అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి విజయ్ విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణ అత్యంత సాధారణంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణ పౌరుడిగా ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి అనే అధికార దర్పానికి దళపతి విజయ్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్న నుంచి సాధారణంగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హడావుడికి దూరంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా హాస్టల్‌లోకి ప్రవేశించిన విజయ్‌ని చూసి అక్కడి విద్యార్థులు మొదట ఆశ్చర్యపోయారు. ఒక ముఖ్యమంత్రి తన స్థాయిని పక్కన పెట్టి, హాస్టల్ గదుల్లోకి వెళ్లి మరీ విద్యార్థులతో మాట్లాడటం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ పర్యటనలో ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో అందుతున్న భోజన నాణ్యత, వార్డెన్ల ప్రవర్తన, అక్కడ ఉన్న వసతులు వంటి అంశాల గురించి విద్యార్థులు ఏమాత్రం భయం లేకుండా ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా, ఒక ముఖ్యమంత్రి తమ సమస్యలను ఓపికగా వింటున్నారన్న విషయాన్ని చూసి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కేవలం వినడమే కాకుండా, తదుపరి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇవ్వడం, ప్రభుత్వ వ్యవస్థలలో పారదర్శకతను పెంచేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొత్త తరం రాజకీయాలు

గత నాలుగు, ఐదు దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళ రాజకీయాల్లో, విజయ్ సరికొత్తగా పాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటి నుండి ఆయన వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే, ఆయన కేవలం 'సినిమా హీరో' మాత్రమే కాదు, 'ప్రజల మనిషి' అని నిరూపించుకుంటున్నారు. గతంలో ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం, ఇప్పుడు ఇలా హాస్టల్ విద్యార్థుల కష్టాలను అడిగి తెలుసుకోవడం.. ఇవన్నీ ఆయన క్షేత్రస్థాయి సమస్యలపై ఎంత పట్టు కలిగి ఉన్నారో చెబుతున్నాయి.

రాజకీయాల్లోకి రాకముందే విజయ్‌కి ఉన్న ప్రజాదరణ, ఆయన ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చడానికి ఉపయోగపడుతోందని అంటు్నారు. సామాన్యుడికి చేరువ కావడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా, సమస్యల మూలాల్లోకి వెళ్లడం అని విజయ్ నిరూపిస్తున్నారు. అధికార యంత్రాంగంపై నిఘా పెంచడం, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం వంటి పనులతో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. విజయ్ ప్రారంభించిన ఈ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ మరిన్ని కీలక మార్పులకు దారితీస్తుందన్న ఆశను రేకిత్తిస్తోందని అంటున్నారు.