Begin typing your search above and press return to search.

డ్రగ్స్ పై పోరు.. తెలంగాణ, ఏపీ ఒకటే 'ఈగల్'..

ఇక ఏపీలో గతంలోనే ‘ఈగల్’ను ప్రారంభించారు. దీని అర్థం.. ఎలైట్ యాంటీ నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   28 Jun 2025 7:00 AM IST
డ్రగ్స్ పై పోరు.. తెలంగాణ, ఏపీ ఒకటే ఈగల్..
X

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాటిలో డ్రగ్స్ ఒకటి.. సాధారణ ప్రజలకూ దొరికే స్థాయిలోకి వచ్చేశాయి గంజాయి, డ్రగ్స్.. నగరాల్లో అయితే స్కూళ్లు, కాలేజీల క్యాంపస్ సమీపంలో విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వాలు మేల్కొంటున్నాయి. డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నాయి. తాజాగా జూన్ 26 మాదక ద్రవ్య వ్యతిరేక దినం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి.

తెలంగాణలో ఇటీవలి వరకు డ్రగ్స్ నియంత్రణను టి-న్యాబ్ చూసేది. తెలంగాణ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో దీని అర్థం. అయితే, టి-న్యాబ్ అంటే ఎవరికీ అర్థం కావడం లేదని భావించారో ఏమో...? ‘ఈగల్‘ అంటూ కొత్త పేరు పెట్టారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలపాలని ప్రజలకు దీని ప్రారంభం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు-గంజాయిపై నిఘాను మరింత బలోపేతం చేయడానికి టీజీ-న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో)ను ‘ఈగల్‘(ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)గా పేరు మార్చినట్లు రేవంత్ ప్రకటించారు. తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇకపై ఈగల్ డేగ కంటితో గమనిస్తుందని హెచ్చరించారు.

ఇక ఏపీలో గతంలోనే ‘ఈగల్’ను ప్రారంభించారు. దీని అర్థం.. ఎలైట్ యాంటీ నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్ కావడం గమనార్హం.

రెండూ గద్దలే.. రంగు తేడా..

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ’ఈగల్’ రెండూ వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. తెలంగాణ ఈగల్ బ్లూ కాగా.. ఆంధ్రా గద్ద గోల్డ్ కలర్. కాగా, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు తెలంగాణ ఈగల్ లోగోలో గద్ద జీవం లేని కళ్లతో ఉందని, లోగో మార్చడం మంచిదని అంటున్నారు. ఇంకొందరు అసలు డేగ చూపే భయపెడుతుందని.. ఈగల్ బాగా పాపులర్ పదం అని పేర్కొంటున్నారు. డేగ కళ్లతో నిఘా... అనేదానికి మించిన పదం లేదని స్పష్టం చేస్తున్నారు. డేగది సునిశిత దృష్టి అని.. వేల అడుగుల ఎత్తు నుంచి నేలపై ఉన్న సూదిని కూడా చూడగలదని విశ్లేషిస్తున్నారు. ఇది సరే కానీ.. ఒకరు ఈగల్ అని మరొకరు గరుడ అని పెడితే సరిపోయేది కదా? అని చాలామంది సూచిస్తున్నారు. ఉద్దేశం ఒకటే అయినప్పుడు పేరు ఏదైతే ఏమిటని సమర్థకులు వాదిస్తున్నారు.