సోషల్ మీడియా పోస్టులకు 7 ఏళ్ల జైలు.. తెలంగాణ సర్కార్ సంచలనం
సోషల్ మీడియాలో నోరు పారేసుకునే వారికి గట్టి గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 30 March 2026 5:35 PM ISTసోషల్ మీడియాలో నోరు పారేసుకునే వారికి గట్టి గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యం, వాక్ స్వాంత్రం పేరుతో ఇతరుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో అడ్డగోలు ప్రచారం, దుష్ప్రచారం, మతాలు, కులాల మధ్య వివాదాలు సృష్టించేలా పోస్టులు, కామెంట్లు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఏడేళ్ల జైలు శిక్ష వేసేలా కొత్త చట్టం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
రాజకీయ పార్టీల అండ ఉందనో లేదా ఫేక్ ఐడీలతో తప్పించుకోవచ్చనో భావించే సోషల్ మీడియా కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారు, వ్యక్తిత్వ హననానికి ఒడిగట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారికి ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేలా కొత్త నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఇక మతపరమైన ఘర్షణలను ప్రేరేపించేలా లేదా సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడితే అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని తెలిపారు. దీంతో మంత్రి ప్రకటనపై విస్తృత చర్చ జరుగుతోంది.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్‌లు పెట్టడం పెరిగిపోయిందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సోషల్ మీడియా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలకు నడుంచిగించింది. ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సోషల్ మీడియా పోస్టుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగడంతో సోషల్ మీడియా పోస్టులకు సెన్సార్ తప్పనిసరిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ సిద్ధాంతాలను విమర్శించవచ్చు కానీ, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. ఫేక్ న్యూస్ లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలను షేర్ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
