ఆర్టీసీ సమ్మెలో విషాదం.. నర్సంపేటలో డ్రైవర్ బలిదానం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటుచేసుకుంది. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
By: Tupaki Desk | 24 April 2026 1:31 PM ISTతెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటుచేసుకుంది. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమ్మెలో భాగంగా నిరసనకు దిగిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతంపైగా కాలిన గాయాలతో హైదరాబాద్ లో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఈ ఘటనతో కార్మిక లోకం దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు కార్మికులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. డ్రైవర్ ఆత్మహత్యతో ఇటు ప్రభుత్వం, అటు కార్మికులలో ఆందోళన పెరిగిపోయింది. డిమాండ్ల సాధనకు కార్మికులు ఆత్మబలిదానాలకు సిద్ధమవడంపై కార్మికులు, ప్రభుత్వ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు. ప్రస్తుతం కార్మికులతో చర్చలు జరుగుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దానకిశోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ప్రభుత్వం తరఫున చర్చలకు ఎంపిక చేశారు.
ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు సచివాలయంలో ఉద్యోగుల సంఘంతో సమావేశమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్యోగులు కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని, సాయంత్రం కల్లా ప్రభుత్వంతో చర్చించి ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు కుటుంబాల ఆర్థిక భారం పెరిగిపోయిందని, ఆర్థిక ఉపశమనం కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రధానంగా ఉద్యోగ భద్రతపై హామీ ఇవ్వాలని కోరుతున్నాయి.
ఇక కార్మికుడు ఆత్మహత్యతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రతిపక్ష పార్టీలు కార్మికులకు బాసటగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మరణాన్ని ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని, ఇంత పెద్ద సమ్మె జరిగితే కనీసం పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోవైపు కార్మికులు ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం స్పందిస్తూ కార్మికులు బలిదానాలకు దిగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లపై చిత్తశుద్ధితో ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం డ్రైవర్ బలిదానంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కార్మికులు సహనంతో వ్యవహరించాలని కోరారు.
