తెలంగాణలో 'కొత్త' రాజకీయం.. కేటీఆర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపినట్లు కనిపిస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 15 Feb 2026 1:00 AM ISTతెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో డీలా పడిన ప్రతిపక్షాలు భవిష్యత్తు రాజకీయాల కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నాయని అంటున్నారు. అధికార పక్షం కూడా రాష్ట్రంపై మరింత పట్టు సాధించేలా ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ దక్కని పట్టణ సంస్థలు, కార్పొరేషన్లలో చిగురిస్తున్న కొత్త స్నేహాలు భవిష్యత్తు రాజకీయాలను శాసించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో మొత్తం 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎవరికీ పూర్తి మెజార్టీ దక్కలేదని చెబుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో బీజేపీ, సీపీఐ పార్టీలు ఇతర పార్టీల మద్దతు తీసుకుంటే కానీ మేయర్ పీఠం అధిష్టించే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. అయితే ఈ రెండు చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజామాబాద్ లో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినా, ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని తన్నుకుపోయే పరిస్థితులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
నిజానికి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్-ఎంఐఎం పొత్తు కుదిరితే భవిష్యత్తులో ఆ పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్-ఎంఐఎం మధ్య పొత్తు లేకపోవడం వల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఇరుపార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు సంకేతాలు పంపుతున్నా, నేరుగా అధికారాన్ని, పదవులను పంచుకోలేదు. ఇప్పుడు నిజామాబాద్ లో అందుకు తొలి అడుగు పడితే భవిష్యత్తులో జరగబోయే బల్దియా ఎన్నికల్లోనూ ప్రభావం చూపవచ్చునని అంటున్నారు.
అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో సైతం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ప్రభుత్వంలో భాగంగా ఉన్న సీపీఐ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్-సీపీఐ మధ్య సీట్ల పంచాయితీ ఏర్పడటంతో ఇరుపార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే ఎన్నికల్లో సీపీఐ ఎక్కువ స్థానాలు సాధించింది, కానీ మేయర్ పీఠం అధిష్టించేంత మెజార్టీ దక్కించుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో సీపీఐకి బేషరతుగా మద్దుతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సీపీఐ కోరకపోయినా బీఆర్ఎస్ అగ్రనేత చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, సీపీఐ ఆపార్టీతో పొత్తుకు ఎంతో ప్రయత్నించింది. 2022లో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బేషరతుగా సీపీఐ మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నిక తర్వాత సీపీఐతోపాటు కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఎన్నికల ముందు బీఆర్ఎస్ హ్యాండివ్వడంతో సీపీఐ కాంగ్రెస్ కు దగ్గరైంది. కొత్తగూడెంలో పొత్తుపెట్టుకుని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం ప్రయత్నిస్తున్న సీపీఐ తన మిత్రపక్షం కాంగ్రెస్ మద్దతు కోరుతుందా? లేక స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బీఆర్ఎస్ తో కొత్త పొత్తుకు తెరతీస్తుందా? అన్న సందిగ్ధం ఏర్పడింది.
బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ తో సీపీఐ అటు వైపు మొగ్గితే రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలకు తెర తీసినట్లుగానే భావించాలని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఓటములతో కుదేలు అయిన బీఆర్ఎస్ తిరిగి కోలుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో తొలి విజయం సాధించినట్లుగా చూడొచ్చని చెబుతున్నారు. సీపీఐ-బీఆర్ఎస్ మధ్య స్నేహం చిగురిస్తే మరో కమ్యూనిస్టు పార్టీ సీపీఎం కూడా కారు పార్టీకి దగ్గర అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సీపీఐ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదులుకోవడం అంత తేలికైన విషయం కాదని అంటున్నారు. రెండు పార్టీల మధ్య జాతీయ స్థాయిలో కూడా బలమైన అనుబంధం కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల ముందు చివరి వరకు వెయిట్ చేయించి తీవ్రంగా అవమానించిన బీఆర్ఎస్ పార్టీతో సీపీఐ కలవడం అసాధ్యమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. మేయర్ పీఠం వదులుకోడానికి సిద్ధంగా లేని సీపీఐ అవసరమైతే ఎవరితోనైనా పొత్తుకు రెడీ అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అనుసరించబోయే వ్యూహం కూడా ప్రధానంగా చర్చకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమే కొత్తగూడెం కార్పొరేషన్ పాలకవర్గాన్ని డిసైడ్ చేస్తుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ వేసిన పాచిక ఎంతవరకు పారుతుందనేది చూడాల్సివుందని అంటున్నారు.
