Begin typing your search above and press return to search.

జీవన్ రెడ్డి బాటలో పోచారం నడుస్తారా..? పార్టీలో గుబులు.. ఇటీవల ఆయన వ్యాఖ్యలే నిదర్శనం..!

రాజకీయాల్లో ‘సీనియర్ల సెగ’ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

By:  Tupaki Desk   |   14 April 2026 7:00 AM IST
జీవన్ రెడ్డి బాటలో పోచారం నడుస్తారా..? పార్టీలో గుబులు.. ఇటీవల ఆయన వ్యాఖ్యలే నిదర్శనం..!
X

రాజకీయాల్లో ‘సీనియర్ల సెగ’ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. నాలుగు దశాబ్దాల పాటు పార్టీని నమ్ముకొని పని చేసిన, అనుభవం ఉన్న జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం ఒక ఎత్తయితే, ఇప్పుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఏకంగా రిజర్వాయర్ వద్ద బైఠాయించి నిరసన తెలపడం మరో సంచలనంగా మారింది. ‘మంత్రుల కాళ్లు మొక్కాలా?’ అని ఆయన అడిగిన ప్రశ్న ప్రభుత్వంలోని అంతర్గత సమన్వయ లోపాన్ని ఎత్తి చూపుతోంది.

ప్రభుత్వంపై తిరుగుబాటు

తెలంగాణ రాజకీయాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి అత్యంత మర్యాద పూర్వకమైన, నిలకడైన నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఒక ప్రాజెక్టు వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారంటే, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయన ఎంతటి మానసిక వేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. జీవన్ రెడ్డి బాటలోనే ఈయన కూడా కీలక నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.

పోచారం ఆగ్రహానికి కారణాలు:

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు ఇస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోకపోవడం.

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని 20 సార్లు దీని గురించి అడిగినా ఫలితం లేకపోవడం, ఫోన్ చేసినా మంత్రులు స్పందించకపోవడం ఆయనను అవమానానికి గురిచేసింది. ‘ఈ వయసులో మంత్రుల కాళ్లు మొక్కాలా?’ అన్న ఆయన ఆవేదన రాజకీయ వర్గాలను ఆలోచింపజేస్తోంది.

బీఆర్‌ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవని, ఇప్పుడు పాలన అసలు సాగుతుందా లేదా అని ఆయన సందేహం వ్యక్తం చేయడం ద్వారా పరోక్షంగా గత ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉందని కితాబిచ్చారు.

రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.., పోచారం కేవలం నిధుల కోసమే ఈ నిరసన చేయడం లేదు. ఆయన మాటల్లో ఒక రకమైన క్లారిటీ కనిపిస్తోంది. ఒకప్పుడు స్పీకర్‌గా అందరినీ శాసించిన ఆయన, ఇప్పుడు మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం వేచి చూడడం ఆయన వ్యక్తిత్వానికి ఇబ్బందిగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి, తర్వాత ఆ పార్టీకి దూరమైనట్లు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ గులాబీ కండువా కప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందని విమర్శిస్తూ బయటకు వెళ్లడం, పోచారం వంటి సీనియర్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఒకవేళ పోచారం శ్రీనివాస రెడ్డి కూడా పార్టీకి దూరమైతే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఇది పెద్ద దెబ్బ అవుతుంది. అభివృద్ధి పనుల విషయంలో సీనియర్ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్ వద్ద బైఠాయించిన ఆయన నిరసన, కేవలం నిధుల కోసమేనా లేక పార్టీ మార్పునకు నాంది పలుకుతుందా అన్నది మరికొద్ది రోజుల్లోనే స్పష్టమవ్వనుంది.