Begin typing your search above and press return to search.

పవన్ తో కలసి ముందుకే అంటున్న టీడీపీ!

ఆ కమిటీలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. సీనియర్ మోస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ యనమల రామక్రిష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య మెంబర్స్ గా ఉంటారు

By:  Tupaki Desk   |   16 Oct 2023 4:55 AM GMT
పవన్ తో కలసి ముందుకే అంటున్న టీడీపీ!
X

ఏపీలో పొత్తుల రాజకీయం జోరందుకుంది. సరిగ్గా నెల క్రితం రాజమండ్రి జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులతో ముందుకు సాగుతున్నామని స్పష్టమైన ప్రకటన ఇచ్చారు. ఆ తరువాత ఎందుకో అటూ ఇటూ కొంత అడుగులు మందగించాయి. అయితే ఇపుడు మాత్రం సరైన దిశగా వేగంగా దూకుడుగా అడుగులు పడుతున్నాయి.

పవన్ జనసేన టీడీపీతో కో ఆర్డినేషన్ కోసం తన పార్టీలో కమిటీని వేసి చాలా కాలం అయింది. చెప్పాలంటే పొత్తు ప్రకటన తరువాత వెంటనే నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ మాత్రం చంద్రబాబు లేని సమయంలో పార్టీని నడిపేందుకు పొలిటికల్ యాక్షన్ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అందులో పద్నాలుగు మంది మెంబర్స్ ఉన్నారు.

అది జరిగిన చాన్నాళ్ళకు ఇపుడు కో ఆర్డినేషన్ కమిటీని టీడీపీ నియమించింది. ఆ కమిటీలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు. సీనియర్ మోస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ యనమల రామక్రిష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య మెంబర్స్ గా ఉంటారు.

ఇలా అయిదుగురుతో వేసిన ఈ కమిటీ నాదెండ్ల తో కూడిన జనసేన కో ఆర్డినేషన్ కమిటీతో చర్చలు జరుపుతుంది. ఈ చర్చలు కేవలం రెండు పార్టీలూ ఎలా ఉమ్మడిగా ఆందోళనలు నిర్వహించాలన్న దానికే పరిమితం కాకుండా ఎవరెవరికి ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయన దాని మీద కూడా చర్చిస్తుంది అని అంటున్నారు.

అంటే ఒక విధంగా పొత్తుల విషయంలోనూ ఈ రెండు కమిటీలే మాట్లాడుకుని ముందుకు సాగుతాయి అని అంటున్నారు. అలా ఈ కమిటీలు ఉమ్మడిగా రచించిన వ్యూహం కానీ వ్యవహారం కానీ ఆయా పార్టీల అధినేతలకు నివేదికను ఇస్తాయని దాని మీద అసలు కార్యాచరణ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.

మొత్తానికి అటు పవన్ షూటింగులతో కొంత బిజీగా ఉన్నారు. ఆ పార్టీ వ్యవహారాలు నాదెండ్ల ఎక్కువగా చక్కబెడుతూ ఉంటారు. ఇటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ యనమల టీడీపీ తరఫున యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. దాంతో రానున్న కాలంలో జనసేన జెండా టీడీపీ పసుపు జెండా కలసి ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాయని అంటున్నారు.

ఏది ఏమైనా రానున్న రోజులలో అధికార వైసీపీని ఎదుర్కోవడం కోసం జాయింట్ యాక్షన్ అన్నది చాలా ముఖ్యమని రెండు పార్టీలకు తెలుసు. ఆ దిశగా ఏమేమి చేయాలో అన్నీ కూర్చుని చర్చిస్తారని అంటున్నారు. ఇక మీదట ఏపీలో ఈ రెండు పార్టీల ఆందోళనతో రాజకీయంగా అధికార వైసీపీని కొంత ఇబ్బంది పెట్టేలాగానే కార్యక్రమాలు రూపొందిస్తారు అని అంటున్నారు. ఎప్పటికపుడు అవసరమైన డైరెక్షన్ జైలు నుంచి చంద్రబాబు అందిస్తారు అని అంటున్నారు. సో సైకిల్ గాజు గ్లాసూ రెండూ కలసి ఏపీలో బిగ్ సౌండ్ చేస్తాయన్న మాట.