Begin typing your search above and press return to search.

టీడీపీ, జనసేన.. వీళ్లేం కలిసి పని చేస్తారు?

ఐతే చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ మధ్య గొడవ జరగాలి కానీ.. చిత్రంగా టీడీపీ వెర్సస్ జనసేన అన్నట్లుగా సోషల్ మీడియాలో సీన్ మారిపోతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం.

By:  Tupaki Desk   |   9 Sep 2023 12:19 PM GMT
టీడీపీ, జనసేన.. వీళ్లేం కలిసి పని చేస్తారు?
X

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లో పేరే లేని చంద్రబాబును అరెస్ట్ చెయ్యడం అన్యాయం అని తెలుగుదేశం వాళ్లు తీవ్రంగా నిరసిస్తుంటే.. ఆధారాలు ఉండబట్టే చంద్రబాబు అరెస్టయ్యాడంటూ వైసీపీ వాళ్లు వాదిస్తన్నారు.

ఐతే చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ మధ్య గొడవ జరగాలి కానీ.. చిత్రంగా టీడీపీ వెర్సస్ జనసేన అన్నట్లుగా సోషల్ మీడియాలో సీన్ మారిపోతుండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. టీడీపీ, జనసేన పొత్తు దిశగా కొన్ని నెలల కిందటే సంకేతాలు వచ్చినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆ రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు ఉప్పు నిప్పు అన్నట్లే ఉంటున్నారు.

పొత్తు, సీట్ల పంపకాల విషయంలో ఒకరినొకరు నిందించుకోవడం.. కించపరుచుకోవడమే కనిపిస్తోంది తప్ప.. కలిసి పని చేసే సంకేతాలు ఆ రెండు పార్టీల సోషల్ మీడియా వారియర్స్‌లో రవ్వంతైనా అగుపించట్లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మీద జనసేన వాళ్లు కౌంటర్లు వేయడం.. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేస్తూ పోస్టులు పెట్టడం కనిపిస్తోంది. ఈ మధ్య సీట్ల పంపకాల విషయంలో తమను ఎద్దేవా చేసినట్లు టీడీపీ వాళ్లు మాట్లాడితే.. జనసైనికులు పవన్ కళ్యాణే కాబోయే సీఎం అని పేర్కొంటూ 'ఎండ్ ఆఫ్ టీడీపీ' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేశారు. ఆ గొడవ తర్వాత ఇప్పుడు బాబు అరెస్ట్ వ్యవహారం మీద జనసేన వాళ్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతుండగా.. వాళ్లను టీడీపీ వాళ్లు కౌంటర్ చేస్తున్నారు.

ఇలా ఈ ఉదయం నుంచి టీడీపీ వెర్సస్ జనసేన ఫైట్ నడుస్తోంది ట్విట్టర్లో. ఈ రెండు వర్గాల మధ్య గొడవ పెట్టడంలో వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ తమ పనితనం బాగానే చూపిస్తున్నాయి. ఐతే ఈ విషయం గ్రహించకుండా.. టీడీపీ, జనసేన కార్యకర్తలు తెగ కొట్టేసుకుంటూ వైసీపీ కోరుకున్న ప్రయోజనం చేకూరుస్తున్నారు. నిప్పు, ఉప్పులా ఉన్న ఈ రెండు పార్టీల మద్దతుదారులు.. రేప్పొద్దున పొత్తు పొడిచినా ఏమాత్రం కలిసి పని చేస్తారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.