Begin typing your search above and press return to search.

టీడీపీ రెండో జాబితా విడుదల.. ఆ సీనియర్స్ కి బిగ్ షాక్!

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది.

By:  Tupaki Desk   |   14 March 2024 10:00 AM GMT
టీడీపీ రెండో జాబితా విడుదల.. ఆ సీనియర్స్  కి బిగ్  షాక్!
X

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యింది. ఇందులో భాగంగా 34 మందికి బాబు అవకాశం ఇచ్చారు. అంటే... తొలిజాబితాలో 94 మందిని కలుపుకుంటే... 128 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక మిగిలింది 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ సమయంలో ఒక కీలక అంశం తెరపైకి వచ్చింది.

అవును... పొత్తులో భాగంగా జనసేనకు 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలకు కేటాఇంచిన చంద్రబాబు... టీడీపీ పోటీ చేయబోయే 144 స్థానాల్లోనూ ఇక కేవలం 16 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో తాజా లిస్ట్ లో రాజమండ్రి రూరల్ నుంచి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరితో పాటు దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, ఆత్మకూరు నుంచి ఆనం రాం నారాయణ రెడ్డి మొదలైన వారికి టిక్కెట్లు ప్రకటించారు.

అయితే ఊహించని రీతిగా అన్నట్లుగా టీడీపీలోని కీలక నేతలు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలు, పార్టీకి అత్యంత విధేయులుగా పేరున్న కొంతమంది పేర్లు రెండో జాబితాలోనూ వినిపించలేదనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ నీయాంశం అవుతుంది. దీంతో... ఈ సరికొత్త సమస్యవల్ల మొదటికే మోసం వస్తుందేమోననే ఆందోళనలో తమ్ముళ్లు ఉన్నారని తెలుస్తుంది.

టీడీపీ రెండో జాబితాలోనూ అనూహ్యంగా మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు పేరు లేదు. ఈయనను చంద్రబాబు చీపురుపల్లి వెళ్లమంటే... ఈయన మాత్రం విశాఖ వదిలి వెళ్లనని పట్టుబట్టి కుర్చున్నారని తెలుస్తుంది. దీంతో... రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో... గంటా నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో మరో సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి పేరూ ఈ లిస్ట్ లో కనిపించలేదు.

వీరితోపాటు మాజీమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఎస్ జవహార్, దేవినేని ఉమల పేర్లు కూడా కనిపించకపోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరితోపాటు ఆలపాటి రాజా, కొమ్మాలపాటి శ్రీధర్ లకూ చుక్కెదురవ్వడంతో టీడీపీలో ఏమి జరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది. వీరిలో మైలవరం టిక్కెట్ ఈసారికి వసంత కృష్ణప్రసాద్ కి ఇచ్చే అవకాశం ఉందని, దేవినేనికి రెస్ట్ అని కథనాలొచ్చిన వేళ... ఆయన పేరు కూడా లేకపోవడం గమనార్హం!

ఇక 2014లో కొవ్వూరు నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయిన కేఎస్ జవహార్ కు 2019లో తిరువూరు టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే అక్కడ ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో ఈసారి టిక్కెట్ ఎక్కడ ఇస్తారు.. అసలు ఇస్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కొవ్వురూ టిక్కెట్ ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఇవ్వగా... తిరువూరు టిక్కెట్ కొలికపూడి శ్రీనివాస్ కి కేటాయించారు. దీంతో జవహార్ కు ఈసారికి సారీ యేనా అనే ప్రశ్న తలెత్తుతుంది!

ఇక గుంటూరుజిల్లా పెదకూరపాడు నుంచి మూడు సార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన కొమ్మాలపాటి శ్రీధర్ పేరు ఈదఫా కూడా వినిపించలేదు. ఈసారి కూరపాడు టిక్కెట్ ను భాష్యం ప్రవీణ్ కు కేటాయించారు చంద్రబాబు. దీంతో ఈసారి ఈయనకు రెస్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. మరి ఈ సీనియర్లకు చంద్రబాబు ఇప్పటికే సమాచారం అందించారా.. లేక, మూడో లిస్ట్ వరకూ వేచి చూసే పరిస్థితి ఉంటుందా అనేది వేచి చూడాలి!