Begin typing your search above and press return to search.

టికెట్ తేల్చకుండానే తడిసి మోపెడు...తమ్ముళ్ళ గోల...!

నారా లోకేష్ యువగళం పేరిట గత ఏడాది అంతా చేసిన పాదయాత్ర ఖర్చు వందల కోట్లలోనే. అపుడు ఖర్చు పెట్టుకున్న తమ్ముళ్లకు సీటు అన్నది ఇప్పటికీ ఖరారు కాలేదు

By:  Tupaki Desk   |   14 Feb 2024 12:30 PM GMT
టికెట్ తేల్చకుండానే తడిసి మోపెడు...తమ్ముళ్ళ గోల...!
X

టికెట్ తేల్చితే ఎంతటి ఖర్చు అయినా భరించేందుకు రెడీ అంటున్నారు తమ్ముళ్ళు. అలా కాకుండా టికెట్ ఎవరికిస్తారో చెప్పరు, పొత్తులో సీటు అసలు ఉంటుందో లేదో చెప్పరు. కానీ ఖర్చు పెట్టించేస్తున్నారు అని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. నారా లోకేష్ యువగళం పేరిట గత ఏడాది అంతా చేసిన పాదయాత్ర ఖర్చు వందల కోట్లలోనే. అపుడు ఖర్చు పెట్టుకున్న తమ్ముళ్లకు సీటు అన్నది ఇప్పటికీ ఖరారు కాలేదు.

రోజుకే మూడు నాలుగు కోట్ల వంతున ఆనాడు ఖర్చు అయింది అని ప్రచారం సాగింది. రెండు నెలల విరామం అనంతరం లోకేష్ మళ్లీ శంఖారావం సభలతో జనంలోకి వచ్చారు. ఉత్తరాంధ్రాలో ఏకంగా 31 సభలను నిర్వహించాలని భారీ ప్లాన్ తో లోకేష్ దిగారు.

అయితే ఖర్చు ఎవరు భరిస్తారు అంటే మళ్లీ తమ్ముళ్లే. శంఖారావం నియోజకవర్గాల సభకు ఒక్కోదానికే ఖర్చు రెండు మూడు కోట్లు అని ఉజ్జాయింపుగా లెక్క వేస్తున్నారు. ఈ సభల విషయంలో పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదు. టికెట్ రేసులో ఉన్న ఆశావహులంతా పెట్టుకోవాలని సూచించిందని అంటున్నారు.

దాంతో తమ్ముళ్లు అంతా కలసి చాలా నియోజకవర్గాలలో ఖర్చు పెట్టుకున్నారు. అయితే లోకేష్ మాత్రం కేవలం కింజరాపు కుటుంబంలోని బాబాయ్ అబ్బాయ్, అలాగే ఆముదాలవలసలో కూన రవికుమార్ లకు మాత్రమే హామీ ఇచ్చేసి వెళ్లిపోయారు. ఎంపీ టికెట్ రామ్మోహన్ కు ఖాయం. అలాగే అచ్చెన్నాయుడుకు టెక్కలి కన్ ఫర్మ్ అయింది. కూన రవికుమార్ ఆముదాలవలస నుంచి చేస్తారు.

ఇక ఉమ్మడి జిల్లాలో మిగిలిన ఎనిమిది సీట్ల విషయంలో లోకేష్ ఎటూ తేల్చలేదు అని అంటున్నారు. పాతపట్నంలో రెండు వర్గాలు ఉన్నా జై కలమట అంటూ మాజీ ఎమ్మెల్యే వర్గం, అలాగే మామిడి గోవిందరావు వర్గం మధ్య టికెట్ పోరు సాగుతోంది. అదే విధంగా నరసన్నపేట తమ్ముళ్ల టికెట్ విషయంలోనూ తేల్చలేదు. ఎస్టీ నియోజకవర్గం పాలకొండలో నిమ్మక జయకృష్ణ వర్సెస్ ప్రత్యర్ధులు అన్నట్లుగా సొంత పార్టీలో పోరు ఉంది.

ఆఖరుకు శ్రీకాకుళంలో కూడా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు గోండు శంకర్ వర్గాలు సీటు కోసం పోటీ పడుతున్నాయి. ఎక్కడా ఏ సంగతి తేల్చని లోకేష్ సభలకు మాత్రం తమ్ముళ్లు అంతా కలసి చేతి చమురు వదిలించుకుంటున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సీట్లలో కొన్ని జనసేనకు పొత్తులో కావాలని కోరుతోంది. పాతపట్నం, పాలకొండ, పలాస, ఆఖరుకు శ్రీకాకుళం కూడా ఆ పార్టీ అడుగుతోంది. దాంతో తమ్ముళ్లలో కొత్త గుబులు రేగుతోంది.