Begin typing your search above and press return to search.

టీడీపీ హోం మంత్రులకు పెరిగిపోతున్న డిమాండ్!

ఆలూ లేదు చూలూ లేదు అని ఒక ముతక సామెత ఉంది. ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీ గురించి కూడా చూడబోతే అలాగే ఉంది మరి

By:  Tupaki Desk   |   28 Nov 2023 4:57 PM GMT
టీడీపీ హోం మంత్రులకు పెరిగిపోతున్న డిమాండ్!
X

ఆలూ లేదు చూలూ లేదు అని ఒక ముతక సామెత ఉంది. ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీ గురించి కూడా చూడబోతే అలాగే ఉంది మరి. వైసీపీకి 2019 ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయి. వీటికి ఎన్ని పొత్తులు కలుపుకున్నా మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి అంటే 88 సీట్ల మార్క్ చేరడానికి ఇంకా 65 సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒక విధంగా బిగ్ టాస్క్ అన్న మాట.

ఈ నేపధ్యంలో జనసేనతో పొత్తు, చంద్రబాబు జైలు పాలు కావడం వల్ల సింపతీ వస్తుంది ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద జనాల వ్యతిరేకత ఇలా అన్నీ కలుపుకుంటే కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని టీడీపీకి ధీమా కనిపిస్తోంది. దాంతో ఈసారి అధికారం మాదే అని ఆ పార్టీ చెప్పుకుంటోంది.

సరే అధికారంలోకి వస్తామనడం వేరు వచ్చేస్తున్నామని చెప్పడం వేరు. అయితే టీడీపీ అధికారంలోకి రావడమే తరువాయి మధ్యలో క్యాలెండర్ డేట్లే అడ్డు అన్నట్లుగా ఆరాటపడుతోంది అంటున్నారు. అంటే 2023 డిసెంబర్ ముగిసి 2024 మార్చి దాటితే ఇక కుర్చీ తమదే అన్నది టీడీపీ మాటగా ఉంది.

దాంతో ఇక మంత్రి పదవులు ముఖ్య శాఖల మీద జోరుగా చర్చ సాగుతోంది. టీడీపీలో కీలక శాఖ మీద చాలా మంది సీనియర్లు కన్నేశారు అన్నది చాలా కాలంగా ప్రచారంలో ఉన్నదే. అన్ని శాఖల కంటే కూడా హోం శాఖ మీదనే కన్ను చాలా మందికి ఉంది. అందరి దాకా ఎందుకు చంద్రబాబు తనయుడు చినబాబుకు కూడా హోం శాఖ మీద తెగ మోజు ఉంది అంటున్నారు.

ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ సంగతి చూస్తాను అంటున్నారు. ఒక్కొక్కరి చిట్టాను రెడ్ బుక్ పెట్టి మరీ రాసుకుంటున్నాను అని కూడా అంటున్నారు. ఎవరినీ అసలు వదిలేదు లేదు అని కూడా చెబుతున్నారు. దాంతో ఆయన కచ్చితంగా హోం శాఖనే టార్గెట్ చేశారు అని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే చినబాబు హోం మంత్రి అన్న మాట.

హోం మంత్రి అంటే సీఎం తరువాత అంతటి పోస్ట్. . ఈ పోస్టుని చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా సీఎం గా ఉన్న టైం లో గోదావరి జిల్లాలకు చెందిన నిమ్మకాయల చిన రాజప్పకు ఇచ్చారు. ఆనాడే చాలా మంది ఈ పోస్ట్ మీద మోజు పడ్డా బాబు ఉమ్మడి ఏపీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కడు నమ్మకస్తుడు అయిన రాజప్పకే కట్టబెట్టారు అని అంటారు

ఉమ్మడి ఏపీలో మొదట ఎలిమినేటి మాధవరెడ్డి హోం మంత్రిగా చేశారు. ఆ తరువాత దేవేందర్ గౌడ్ ఈ శాఖను నిర్వహించారు. దేవేందర్ గౌడ్ కీలకంగా వ్యవహరించడమే కాదు ఒక దశలో చంద్రబాబు సీఎం పోస్టుకే పోటీకి వచ్చారు అని అంటారు. దాంతో ఈ పవర్ ఫుల్ పోస్టుని చంద్రబాబు తరువాత తన మాట వినే వారికే ఇచ్చారు అని అంటారు.

ఇక తండ్రి చంద్రబాబు సీఎం అయితే కొడుకు చినబాబుకు అంతటి ప్రాముఖ్యత కలిగిన శాఖ ఇస్తే ఇక మిగిలిన వారికి ఏమిస్తారు అన్న చర్చ కూడా ఉంది. దాంతో చినబాబుకు కాకపోతే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుకు ఈ శాఖ మీద కోరిక ఉంది అంటారు. ఆయన కూడా తనదైన శైలిలో వైసీపీలోని ప్రత్యర్ధుల జాబితాను రెడీ చేసి ఉంచుకున్నారట.

అలాగే మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఈ పోస్ట్ మీద ఆశపడుతున్నారని అంటున్నారు. ఆయన కూడా నేనే హోం మంత్రిని అయితే అని ఆ మధ్య ఒకటి రెండు సందర్భాలలో మనసులో మాటను చెప్పేశారు. విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావుకు కూడా హోం మంత్రి కావాలని ఉంది అని అంటారు. ఆయన కూడా లిస్ట్ లో ఉన్నారని టాక్.

ఇదే విధంగా బీసీ నేతలైన కొల్లు రవీంద్ర వంటి వారు కూడా ఈ పోస్ట్ కోసం చూస్తున్నారు అని చెబుతారు. ఇలా లిస్ట్ కనుక తీసుకుంటే చాలా పెద్దదిగానే ఉంది. అసలైన ట్విస్ట్ ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రేపటి రోజున కీలక పదవులు ఇవ్వాలంటే ఆయన కూడ హోం శాఖనే కోరుకుంటారు అని మరో టాక్ ఉంది. మొత్తానికి టీడీపీ ప్రభుత్వం వస్తే హోం మంత్రులు చాలా మంది రెడీగానే ఉన్నారు అని అంటున్నారు.