Begin typing your search above and press return to search.

టీడీపీది సానుభూతి డ్రామానేనా?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఆయనను ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Sep 2023 11:22 AM GMT
టీడీపీది సానుభూతి డ్రామానేనా?
X

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఆయనను ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కాగా ఈ వ్యవహారం సహజంగానే టీడీపీ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చింది. కేవలం కక్ష సాధింపు కోసమే వైఎస్‌ జగన్‌.. చంద్రబాబును జైలుకు పంపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాను జైలుకు వెళ్లాను కాబట్టి మిగిలిన పార్టీల నేతలు జైలుకు వెళ్లాలన్నట్టు జగన్‌ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు తాజాగా ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ను కలిశారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు పలువురు టీడీపీ నేతలు గవర్నర్‌ ను కలిసినవారిలో ఉన్నారు. గవర్నర్‌ ను కలిశాక అచ్చెన్న నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులోనే చంద్రబాబును ఏమైనా చేస్తారేమోనని హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, గవర్నర్‌కు వివరించామన్నారు. ఇంత ప్రముఖ వ్యక్తిని తనకు కూడా తెలియకుండా అరెస్ట్‌ చేశారని గవర్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తుందని.. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరామని తెలిపారు. నాలుగేళ్ల ఏడు నెలలు అధికారంలో ఉన్న జగన్‌ కు చంద్రబాబు అవినీతి కనిపించలేదా.. ఎన్నికల ముందు అవినీతి కనిపిస్తోందా అని నిలదీశారు.

టీడీపీ ఒంటరిగా గెలుస్తుందని సర్వేలు చెప్పాయని.. ఇక జనసేనతో కలిస్తే అడ్రస్‌ గల్లంతవుతుందని తెలిసిందని.. అందుకే జగన్‌ ఇలా తెగబడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు చేసిన కార్యక్రమాలు ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉన్నాయని.. అందుకే కావాలని ఈ కేసులు ఇరికించి అరెస్టు చేసి జైలు పంపించారని మండిపడ్డారు. 48 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు ఇబ్బందిపెట్టారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారేమో అంటూ ఆయన వ్యాఖ్యానించడంపై చర్చ జరుగుతోంది. తద్వారా ప్రజల్లో సెంటిమెంటును పండించి సానుభూతిని పొందాలని భావించడమే అచ్చెన్న వ్యాఖ్యల వెనుక పరమార్థమంటున్నారు.