Begin typing your search above and press return to search.

జనసేన–టీడీపీ దూకుడు.. మరో కీలక నిర్ణయం!

వచ్చే ఎన్నికల్లో జనసేన –టీడీపీ కలసి పోటీ చేస్తాయని సంచలన ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   18 Sept 2023 9:30 AM
జనసేన–టీడీపీ దూకుడు.. మరో కీలక నిర్ణయం!
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశాక ఏపీ రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును పరామర్శించిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఉన్నఫలంగా పొత్తును ప్రకటించి ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన –టీడీపీ కలసి పోటీ చేస్తాయని సంచలన ప్రకటన చేశారు.

అంతేకాకుండా చంద్రబాబును కలిసి వచ్చిన రెండు రోజుల్లోనే పవన్‌ కళ్యాణ్‌ తన పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జులతో కలిపి సంయుక్త సమావేశం కూడా నిర్వహించేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలను కించపరిచేలా మాట్లాడొద్దని.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టవద్దని కోరారు. వారు తమతో పొత్తుకు వచ్చినంతమాత్రాన మనకేమీ కొమ్ములు రావన్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో, పార్లమెంటులో జనసేన పార్టీ అడుగుపెడుతుందని తెలిపారు.

మరోవైపు టీడీపీ కూడా తమ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉండటంతో ఇప్పటికే బాలకృష్ణ, లోకేశ్‌ అందుబాటులో ఉన్న నేతలతో చిన్నపాటి సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల నేపథ్యంలో జనసేన–టీడీపీ కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ జేఏసీలో ఇరు పార్టీలు సభ్యులు ఉంటారు.

ఇప్పటికే ఈ బాధ్యతలను పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్‌ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు.. చంద్రబాబును కలవనున్నారు. టీడీపీ–జనసేన జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో టీడీపీ తరఫున ఎవరు ఉండాలో చంద్రబాబుతో చర్చించనున్నారని తెలుస్తోంది.

టీడీపీలో సీనియర్‌ నేతలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కేఎస్‌ జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తదితరులు ఇందులో సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది. ఏదో ఒక ప్రాంతం నుంచే కమిటీలో సభ్యులు ఉండేలా కాకుండా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన నేతలకు చోటు కల్పించనున్నారు.

ఇప్పటికే జనసేన తరఫున నాదెండ్ల మనోహర్‌ నేతృత్వం వహిస్తారని ప్రకటించిన నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున కమిటీలో సభ్యులపైన ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలతో పవన్‌ కళ్యాణ్‌ చర్చిస్తున్నారు. ఈ వారంలోనే జనసేన సభ్యుల జాబితా విడుదల అవుతుందని టాక్‌ నడుస్తోంది.

ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రస్తుతం ఢిల్లీలో వరుసగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి చంద్రబాబుతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ సభ్యులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇరు పార్టీలు సభ్యులను నియమించాక ఇరు పార్టీల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం ఈనెలలోనే జరుగుతుందని చెబుతున్నారు. ఎక్కువ ఆలస్యం చేయకూడదని.. ఈ కార్యక్రమాలను శరవేగంగా చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది.