Begin typing your search above and press return to search.

జనసేనకు టీడీపీయే అసలైన ప్రత్యర్ధి...?

రాజకీయ పార్టీ ఏదైనా సరే తానే రేసులో ముందుకు రావాలని చూస్తుంది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే సింహాసనం

By:  Tupaki Desk   |   16 Aug 2023 3:58 AM GMT
జనసేనకు టీడీపీయే అసలైన ప్రత్యర్ధి...?
X

రాజకీయ పార్టీ ఏదైనా సరే తానే రేసులో ముందుకు రావాలని చూస్తుంది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే సింహాసనం. దాన్ని కైవశం చేసుకోవడానికే రాజకీయ పరుగు పందెం సాగుతుంది. అలా కనుక చూసుకుంటే ప్రత్యర్ధులలో ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ ఉండదు, ప్రత్యర్ధి అంటే ప్రత్యర్దే. ఈ థియరీ తెలుగుదేశానికి బాగా తెలుసు కాబట్టి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పార్టీ కాబట్టి ప్రత్యర్ధులు మిత్రులు అయినా సరే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది.

వారిని ఎపుడూ జూనియర్ పార్టనర్స్ గానే చూస్తుంది. సీట్ల దగ్గర తన మాటే నెగ్గించుకోవాలని చూస్తుంది. ఇక ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉంటే అందులో వైసీపీ అధికారంలో ఉంది. రూల్ ప్రకారం అయితే వైసీపీని టీడీపీ జనసేన రెండూ వ్యతిరేకించాలి. అలాగే వ్యతిరేకిస్తున్నాయి కూడా. అదే విధంగా జనసేనను టీడీపీ ప్రత్యర్థి గా చూడాలి, టీడీపీని కూడా మరో పోటీదారుగా జనసేన చూడాలి.

అయితే ఇక్కడే తేడా వస్తోంది అని అంటున్నారు. టీడీపీ జనసేనను ప్రత్యర్ధిగానే చూస్తోంది. కానీ బాహాటంగా మాత్రం అది కనిపించడంలేదు. కానీ జనసేన మాత్రం తనకు ఏపీలో ఏకైన ప్రత్యర్ధి వైసీపీ మాత్రమే అనుకుంటోంది. వైసీపీని గద్దె దించితే చాలు అధికారానికి తాము చాలా దగ్గరగా వచ్చేస్తామని లెక్క వేసుకుంటోంది.

వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ గా అవతరించి కింగ్ కావచ్చు అని కూడా అంచనా వేసుకుంటోంది. కానీ ఇక్కడే జనసేన ఆలోచనలు తప్పు అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. వైసీపీ గద్దే దిగితే టీడీపీ గద్దెనెక్కుతుంది తప్ప జనసేన కానే కాదు, ఇక సీట్ల షేరింగ్ దగ్గర ఆ విషయం ఎటూ తేలుతుంది అని అంటున్నారు.

మరో వైపు 2029 వరకూ జనసేన ఆగవచ్చు అని అనుకున్నా అప్పటిదాకా ఏపీలో అధికారంలోకి ఒకవేళ టీడీపీ వస్తే జనసేనకు అడ్వాంటేజ్ ఇస్తుందా అన్నది మరో పాయింట్. ఏపీలో టీడీపీ మళ్ళీ పవర్ లోకి రావాలి కానీ ప్రత్యర్ధులు ఎవరూ లేకుండా చూసుకునే విధంగా పాలిటిక్స్ నడపడం ఖాయమని అంటున్నారు. టీడీపీ విజన్ మారింది. విజన్ 2047 అని కొత్త స్లోగన్ ని ఆ పార్టీ అందుకుంది. దాంతో ఆ పార్టీ ఈసారి అధికారం దక్కిచుకుంటే మరో పాతికేళ్ల దాకా గద్దే దిగకుండా ఎలా కంటిన్యూ అవాలని ప్రణాళికలు వేసుకుంటుంది అని అంటున్నారు.

మరో విషయం ఏంటి అంటే వైసీపీ మీద జనసేన చేస్తున్న పోరాటానికి టీడీపీకి మద్దతుగా ఉన్న మీడియా ఇపుడు సహకరిస్తోంది. అదే టైం లో వైసీపీ అనుభవ రాహిత్యంతో తొందరపాటు తడబాట్లతో జనసేనకు చాన్స్ కూడా దొరుకుతోంది. కానీ వన్స్ టీడీపీ పవర్ లోకి వస్తే అపర చాణక్యుడు చంద్రబాబు వ్యూహాలతో ప్రత్యర్ధి పార్టీలు గిలగిలలాడడం ఖాయమే అంటున్నారు. అంతే కాదు వైసీపీతో పాటే జనసేనను ట్రీట్ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఇక వైసీపీ ఓడినా అప్పటికే అధికారంలో ఉన్న పార్టీగా సంస్థాగతంగా బలం ఉన్న పార్టీగా 2029 ఎన్నికల కోసం తెగించి పోరాటం చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అదే జనసేన విషయం చూస్తే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పోరాడాలి, అధికారంలో ఉన్న టీడీపీని తట్టుకుని నిలబడాలి, ఎలా చూసుకున్నా జనసేనకు టీడీపీ మిత్రబంధం అన్నది అధికార వ్యూహాలకు ఏ మాత్రం సరిపడని అంశం అని అంటున్నారు.

అందుకే ఈ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి తన సత్తా చాటుకుంటే మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా 2029 నాటికి జనసేన ఆశలు సజీవంగా ఉంటాయని అంటున్నారు. ఇదే విషయాన్ని కాపు సామాజిక వర్గం నేతలు కూడా విశ్లేషించుకుంటున్నారని అంటున్నారు. జనసేన ఒక వైపే అంటే వైసీపీ వైపే చూస్తే మరో బలమైన ప్రత్యర్ధి టీడీపీని పూర్తిగా వదిలేయడం భావం కాదని అది సరైన వ్యూహం కానే కాదని అంటున్నారుట. అందువల్ల టీడీపీని కూడా అసలైన ప్రత్యర్ధిగా భావిస్తేనే జనసేన రూట్ కరెక్ట్ గా వెళ్తున్నట్లుగా అనుకోవాలని విశ్లేషిస్తున్నారుట.

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మూడవ పార్టీగా ముందుకు వస్తున్న జనసేనకు జనాల్లో స్కోప్ ఉంటుందని, పవన్ వారాహి యాత్రకు మంచి స్పందన వస్తోందని, అయితే దాన్ని సొంతంగా బలోపేతం అయ్యే దిశగా వాడుకోవాలని సొంత సామాజికవర్గం నుంచే సూచనలు వస్తున్నాయట. మరి జనసేనాని అయితే వైసీపీ దిగిపోతే చాలు ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఓకే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.