Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేన కూటమి : సీఎం అభ్యర్ధి ఎవరో లోకేష్ చెప్పేశారా...?

వారాహి యాత్రలో సైతం జనసేన అధినేత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటూ అనేకసార్లు ప్రకటనలు చేశారు

By:  Tupaki Desk   |   14 Sep 2023 12:01 PM GMT
టీడీపీ జనసేన కూటమి :  సీఎం అభ్యర్ధి ఎవరో లోకేష్ చెప్పేశారా...?
X

ఏపీలో పాత పొత్తులే కొత్తగా తెర లేచాయి. అందులో విశేషం ఏమీ లేదు. ఇదంతా ఏపీ ప్రజలకు రాజకీయాల మీద బాగా అవగాహన ఉన్న వారికి తెలిసిన విషయమే. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వెనక చంద్రబాబు వంటి అనుభవశాలి విభజన ఏపీకి సీఎం కావాలన్న కోరిక ఉండడమే అని పదే పదే చెప్పారు.

ఇక 2019 ఎన్నికల ముందు టీడీపీ నుంచి జనసేన విడివడి వేరుగా పోటీ చేయడం వెనక కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ఎత్తుగడ ఉందని వైసీపీ ఆరోపణలు చేసింది. దానికి బలం చేకూర్చేలా పవన్ పోటీ చేసిన రెండు చోట్ల టీడీపీ అధినేత ప్రచారం చేయలేదు, అలాగే లోకేష్ చంద్రబాబు నియోజకవర్గాలకు పవన్ వెళ్లి వ్యతిరేక ప్రచారం చేయలేదు అన్నది చెబుతారు.

ఇక 2024 ఎన్నికల విషయమే చూస్తే జనసేన రెండేళ్ల క్రితమే చూచాయగా చెప్పేసింది. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వమని ఇప్పటం సభలోనే పవన్ ప్రకటించారు. అపుడే ఆయన టీడీపీతో పొత్తులకు వెళ్లబోతున్నారు అని అనుకున్నారు. ఏడాది నుంచి పవన్ బాబుల మధ్య చర్చలు జరుగుతున్నయి. ఇపుడు బాబు అరెస్ట్ తో పొత్తు బంధం మీద కీలక ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే జనసేన నుంచి పవనే సీఎం అని అంతా అంటూ వచ్చారు.

వారాహి యాత్రలో సైతం జనసేన అధినేత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటూ అనేకసార్లు ప్రకటనలు చేశారు. జనసైనికులు అయితే పవన్ సీఎం అని భావిస్తూ వచ్చారు. ఇపుడు పొత్తులలో కూడా పవన్ సీఎం అయ్యే చాన్స్ ఉంటుందని ఎవరైనా భావించవచ్చు. ఎందుకంటే రెండు పార్టీల మధ్య అవగాహన ఉంటే అధికారాన్ని పంచుకోవచ్చు.

కానీ ఇలా పొత్తు ప్రకటన పవన్ చేశారో లేదో అలా కాబోయే సీఎం ఎవరో చెప్పకనే నారా లోకేష్ చెప్పేసారు అని అంటున్నారు. మీడియాతో లోకేష్ మాట్లాడుతూ ఏపీకి అనుభవశాలి అయిన వారు సీఎం కావాల్సి ఉందని ఒక కీలక ప్రకటన చేశారు. జనసేన టీడీపీ కూటమిలో అనుభవశాలి అంటే కచ్చితంగా అది చంద్రబాబే అవుతారు అన్నది నిజం. అందులో రెండవ మాటే లేదు.

ఇక పవన్ కళ్యాణ్ సీఎం అన్న మాట కూడా ఉండదన్నట్లుగా ఈ ప్రకటన ఉందని అంటున్నారు. మరి ఇదే తీరున పొత్తు కుదిరితే రేపటి రోజున కూటమి గెలిచి అధికారం చేపడితే చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కీలక మంత్రిగా ఉంటారు తప్ప సీఎం అయితే కాలేదు. మహా అయితే డిప్యూటీ సీఎం గా ఉండవచ్చు. అయితే వైసీపీ అయిదుగురు డిప్యూటీ సీఎమలు ఇచ్చేసి ఆ పదవులను ఆరోవ వేలుగా చేసింది. దాంతో వాటికి మునుపటి క్రేజ్ అయితే లేదు.

మొత్తానికి ఏపీలో జనసేన టీడీపీ పొత్తు వల్ల తెలుగుదేశం పార్టీయే గణనీయంగా లాభపడుతుందని అంటున్నారు. అదే టైంలో జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది.మొత్తానికి జనసేన టీడీపీ వర్సెస్ వైసీపీ పోరులో 2024 ఎన్నికల తరువాత కాబోయే సీఎం ఎవరు అన్నది ఇపుడు జనంలో చర్చగా ఉంది. అంటే పోటీ ముఖాముఖీగా జగన్ వర్సెస్ చంద్రబాబుగానే ఉంటుందని అనుకోవాల్సి వస్తోంది.