Begin typing your search above and press return to search.

ఉమ్మడి మేనిఫెస్టో : టీడీపీ జనసేనలో కొత్త పోరు...?

వారాహి రధమెక్కి పవన్ కళ్యాణ్ కొన్ని జిల్లాలు తిరిగారు. అక్కడ ఆయన చాలా హామీలు ఇచ్చారు. అపుడు పొత్తుల ప్రస్తావన లేదు

By:  Tupaki Desk   |   30 Nov 2023 11:30 AM GMT
ఉమ్మడి మేనిఫెస్టో : టీడీపీ జనసేనలో కొత్త పోరు...?
X

వారాహి రధమెక్కి పవన్ కళ్యాణ్ కొన్ని జిల్లాలు తిరిగారు. అక్కడ ఆయన చాలా హామీలు ఇచ్చారు. అపుడు పొత్తుల ప్రస్తావన లేదు. ఆ తరువాత టీడీపీతో పొత్తు ప్రకటించారు. దీంతో రెండు పార్టీలు కలసి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసే పనిలో పడ్డాయి. ఈ మేరకు ఒక దాన్ని రిలీజ్ చేశాయి కూడా. దానికి మినీ మేనిఫెస్టో అని పేరు పెట్టాయి కూడా.

అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో మీద ఏ పార్టీ ముద్ర ఉంది అన్న దాని మీద కొత్త పోరు అయితే సాగుతోందిట. జనసేన ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టలేదు అని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని టాక్ ఉంది. క్షేత్ర స్థాయిలో ఒక చిన్న సైజ్ ఫైటింగ్ అటూ ఇటూ నాయకుల మధ్య సాగుతోంది అని అంటున్నారు.

ఉమ్మడి మేనిఫెస్టోలో పవన్ హామీలకే పెద్ద పీట వేశామని సీనియర్ టీడీపీ నేత ఆ పార్టీ మ్యానిఫేస్టో కమిటీ చైర్మన్ యనమల రామక్రిష్ణుడు అప్పట్లో చెప్పారు. ఉమ్మడి మేనిఫేస్టోని ఆయన మీడియా ముందు చదివి వినిపించినపుడు ఈ కామెంట్స్ చేశారు. అయితే దీన్ని జనసేన నాయకులు అయితే ఒప్పుకోవడంలేదు.

పేరుకు ఉమ్మడి మేనిఫెస్టో కానీ అప్పటికే టీడీపీ ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలో అంశాలే అందులో ఉంచారని జనసేన నేతలు అంటున్నారు. జనసేన తరఫున మాత్రం ఒక హామీని ఉంచారని అది యువతకు స్వయం ఉపాధి కోసం పది లక్షల రూపాయలను ఇస్తామన్న పవన్ హామీ అని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ హామీకి కూడా ఎన్నో షరతులు పెట్టారని అంటున్నారు.

ఇక జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు ముఖ్యమైన అంశాల మీద తొలి ప్రాధాన్యంగా సంతకాలు పెడతామని జనసేన అధినేత పవన్ అప్పట్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. అందులో మొదటిది ఏంటి అంటే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవడం. అలాగే రెండవది కౌలు రైతులకు సాధారణ రైతులతో సమానంగా గుర్తింపి ఇచ్చే దాని మీద సంతకం.

ఈ రెండు హామీలు కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు అంటున్నది వేరుగా ఉంది. టీడీపీ పెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఆ పార్టీ హామీలే ఎక్కువగా ఉండాలని అన్నది వారి వాదంగా కనిపిస్తోంది. అలాగే తాము ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫేస్టోని రూపొందిస్తున్నామని కూడా చెబుతున్నారు.

కూటమి గెలిచే విధంగా మేనిఫేస్టో ఉంటుంది అని వారు అంటున్నారు. దాంతో పవన్ చెప్పినట్లుగా మే నిఫేస్టో ఉండదన్నట్లుగా క్షేత్ర స్థాయిలో టీడీపీ నాయకులు అంటున్నారుట. ఇలా రెండు పార్టీల నేతలు మేనిఫేస్టో విషయం మీదనే గట్టిగానే వాదించుకుంటున్నారు. నిజానికి టీడీపీ జనసేన పొత్తు మీద రెండు పార్టీలలో గ్రౌండ్ లెవెల్ లో చాలా అభ్యంతరాలు ఉన్నయని అంటున్నారు.

రెండు పార్టీలలో దిగువ స్థాయి నేతల మధ్య అసంతృప్తి ఉంది. అది చిలికి చిలికి గాలి వానగా కొన్ని జిల్లాలలో మారింది అని అంటున్నారు. ఇక రెండు పార్టీలు వేసిన కో ఆర్డినేషన్ కమిటీలు కూడా కొన్ని జిల్లాలో బాగానే సక్సెస్ అయ్యాయి కానీ మరి కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు అని అంటున్నారు.

ఇలా పై స్థాయిలో జనసేన టీడీపీ పొత్తు హాయి హాయిగా ఉందని అంటూంటే దిగువ స్థాయిలో మాత్రం భేదాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అధిపత్యం కోసం వాదనలు జరుగుతున్నాయి. ఇపుడే ఇలా ఉంటే రేపు టికెట్ల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. రెండు పార్టీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. త్యాగరాజులు అయ్యేందుకు ఎవరికీ ఇష్టం లేదు. దాంతోనే అసలు గొడవ వస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ పొత్తులు ఎత్తులు ముందు ముందు మరెన్ని వివాదాలు తీసుకుని వస్తాయో చూడాలని అంటున్నారు.