Begin typing your search above and press return to search.

లైట్లూ... సౌండ్లూ : ఫార్టీ ఇయర్స్ టీడీపీ ఇంతేనా...?

అలాంటి టీడీపీ చంద్రబాబు జైలులో దాదాపుగా నెల రోజులకు పైగా కారాగార వాసం అనుభవిస్తూంటే ఏమి చేయాలి. అసలు టీడీపీ ఆందోళన ఎలా ఉండాలి. ఇవి కదా అందరికీ వచ్చే ప్రశ్నలు.

By:  Tupaki Desk   |   8 Oct 2023 3:22 AM GMT
లైట్లూ... సౌండ్లూ : ఫార్టీ ఇయర్స్ టీడీపీ ఇంతేనా...?
X

తెలుగుదేశం పార్టీ చరిత్ర నాలుగు దశాబ్దాలది. ఎందరో నిబద్ధత కలిగిన పార్టీ నేతలు ఉన్నారు అందులో. అనుభవం కలిగిన వారు, సీనియర్లు ఇలా చాలా మంది ఉన్నారు. అలాంటి టీడీపీ చంద్రబాబు జైలులో దాదాపుగా నెల రోజులకు పైగా కారాగార వాసం అనుభవిస్తూంటే ఏమి చేయాలి. అసలు టీడీపీ ఆందోళన ఎలా ఉండాలి. ఇవి కదా అందరికీ వచ్చే ప్రశ్నలు.

కంచాలు తీసుకుని రండి, చప్పుడు చేయండి అని ఒక పిలుపు. అలాగే లైట్లు వెలిగించండి అంటూ మరో పిలుపు. ఇలా వీకెండ్ లో రెండేసి నిముషాల వంతున ఈ తరహా ఆందోళనలు చేస్తూ వస్తోంది టీడీపీ. దీని వలన ఉపయోగం ఏంటి అన్నదే చర్చ. ప్రజలు ఇందులో పాలుపంచుకోవాలని సంఘీభావం తెలపాలని టీడీపీ ఆలోచన కావచ్చు.

కానీ ప్రజలకు రాజకీయాలు అవసరం లేదు, బాగా పార్టీ మనిషి అయి సానుభూతి తెలపాలని చూస్తేనే తప్ప అలా చేయలేరు. ఇక ఏపీలో వైసీపీ పధకాలు అమలు అవుతున్నాయి. సగటు ప్రజలు బయటపడి వేరే పార్టీ జెండా ఎందుకు ఎత్తుకుంటారు. దాని వల్ల వచ్చే విపరిణామాలు వారికి తెలియవా.

ఈ రకంగా ప్రజలను ఎవరూ భాగస్వాములు చేయలేరు. పైగా ఆందోళన పెద్దగా ఫోకస్ అవదు. అదే వ్యవస్థలను స్థంభింపచేస్తే అపుడు ప్రజలకు దాని వేడి వాడి అర్ధం అవుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా అర్ధం అవుతుంది. బాబు అరెస్ట్ తరువాత అలా అనుకునే మొదట్లో బంద్ పిలుపు ఇచ్చారు. జనసేన కూడా తోడు అయింది.

అయినా సరే బంద్ అనుకున్న విధంగా సాగలేదు. పాక్షికంగానే జరిగింది. దానికి టీడీపీ వారు చెప్పే మాట నిర్బంధం అని పోలీసులు అరెస్టులు అని. అయితే మాత్రం పోరాటంలో వెనకడుగు వేయకూడదు కదా. పోలీసులు అయినా మరొకరు అయినా క్యాడర్ గట్టిగా నిలబడితే కచ్చితంగా ఆందోళన హిట్ అయ్యేది కదా.

టీడీపీలో నిస్తేజం ఉంది. లీడర్స్ ది తలోదారి అవుతోంది. అందరికీ గైడ్ చేయాల్సిన నాయకత్వం కూడా అయోమయంలో ఉంది. అసలు పరిస్థితి ఇలా ఉంది. అందుకే టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలకు సాహసించడంలేదు అంటున్నారు. అయితే ఈ రకంగా చేసే ఆందోళనల వల్ల వేడి గట్టిగా రాజుకోదు అని అంటున్నారు. సరిగ్గా ఇదే మాటను ఒకనాడు టీడీపీలో మంత్రిగా ఉంటూ బీయారెస్ లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ అన్నారు.

టీడీపీలో ఎంతో మంది పదవులు అనుభవించిన వారు ఉన్నారు. అలాగే సీనియర్లు ఉన్నారు. ఎందుకు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయరని ఆయన ప్రశ్నించారు. ఇక లోకేష్ ఇరవై రోజుల తరువాత ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయారు. గ్రౌండ్ లో ఉండాల్సిన వేళ ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. మొత్తం మీద చూస్తే నెల రోజులు అయింది బాబు అరెస్ట్ అయి. ఆ వేడి ఇపుడు చల్లారిపోతోంది. ఇలా వీకెండ్ ప్రోగ్రాం పెట్టుకుని చేస్తే ఏమిటి లాభం అన్నది ఆలోచించాలని అంటున్నారు.

ఇక టీడీపీ ఆశలన్నీ ఈ నెల 9న సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ మీదనే ఉన్నాయి. అక్కడ కనుక ఏదైనా ప్రతికూలంగా తీర్పు వస్తే టీడీపీ సుదీర్ఘమైన పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.మరి ఆ దిశగా ఇప్పటికే గేర్ మార్చాల్సిన సైకిల్ పార్టీ జోరు పెంచే సీన్ ఉందా అన్నదే చర్చ.