Begin typing your search above and press return to search.

చంద్రబాబు పోటీ చేసే రెండో సీటు అదే....?

ఏపీలో చంద్రబాబు ఈసారి గేర్ మార్చారు. గేమ్ కూడా చేంజ్ చేశారు. రూట్ చూసుకుని మరీ టార్గెట్ పక్కాగా ఫిక్స్ చేసుకుంటున్నారు

By:  Tupaki Desk   |   30 Aug 2023 7:45 AM GMT
చంద్రబాబు పోటీ చేసే రెండో సీటు అదే....?
X

ఏపీలో చంద్రబాబు ఈసారి గేర్ మార్చారు. గేమ్ కూడా చేంజ్ చేశారు. రూట్ చూసుకుని మరీ టార్గెట్ పక్కాగా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎపుడూ రెండవ సీటుకు పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ పెట్టాక అధినాయకుడు ఎన్టీయార్ మాత్రం రెండు మూడు సీట్లకు పోటీ చేసి చరిత్ర సృష్టించారు.

చంద్రబాబు 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచి నాటి కాంగ్రెస్ సర్కార్ లో మంత్రి అయ్యారు. 1983లో ఆయన అదే చంద్రగిరి నుంచి పోటీ చేసి టీడీపీ చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాట టీడీపీలో చేరారు. 1985 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 1989 నుంచి ఆయన కుప్పం కి వెళ్ళి అక్కడ నుంచే పోటీ చేస్తూ వస్తున్నారు.

ఇక కుప్పంలో చంద్రబాబు ఇప్పటికి ఏడుసార్లు గెలిచారు. 2024లో కూడా మళ్ళీ పోటీ చేయనున్నారు. కుప్పం టీడీపీకి కంచుకోట అని చెబుతారు కదా మరి అక్కడ సీటు ఉండగా చంద్రబాబు రెండవ చోట నుంచి పోటీ ఎందుకు అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే చంద్రబాబు బహుముఖ వ్యూహాలతోనే రెండవ సీటు నుంచి పోటీ అంటున్నారు అని తెలుస్తోంది.

ఆ రెండవ సీటు గోదావరి జిల్లాలలో ఉండవచ్చు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు చాలా ముఖ్యం. ఇక్కడ 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు గెలిచిన పార్టీదే వచ్చే ఎన్నికల్లో అధికారం అని అంటారు. అది సెంటిమెంట్ కూడా. అందుకే చంద్రబాబు గోదావరి జిల్లాల మీదనే ఫోకస్ పెట్టారని అంటున్నారు.

గ్రేటర్ రాయలసీమ లోని ఉమ్మడి ఆరు జిల్లాలలో మొత్తం 74 సీట్లు ఉన్నాయి. అవి దాటి వస్తే దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఉభయ గోదావరి జిల్లాలతో కలుపుకుని 101 సీట్లు ఉన్నాయి. ఇందులో నూటికి ఎనభై శాతం సీట్లు 2014లో టీడీపీకి రావడం వల్లనే ఆ పార్టీ అపుడు విజయం సాధించింది. ఇపుడు కూడా అదే మ్యాజిక్ ని కంటిన్యూ చేయడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

గోదావరి నుంచే ఏపీ రాజకీయాలను మలుపు తిప్పడానికి చంద్రబాబు రెండవ సీటు నుంచి పోటీ అన్న ఎత్తుగడను ఎంచుకున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా కుప్పంలో చంద్రబాబుకు ఎదురులేదు కానీ 2019 నుంచి టీడీపీని అక్కడ ఓడించాలని వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తోంది. దాని ఫలితంగా కుప్పంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 2014 నాటి మెజారిటీతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. 2014 ఎన్నికల్లో 47 వేల మెజారిటీ వస్తే అది కాస్తా 2019 నాటికి ఏకంగా 30 వేలకు పడిపోయింది.

దానికి ముందు ఎన్నికలు తీసుకుంటే ఎపుడూ బాబు మెజారిటీ 45 వేలకు తగ్గలేదు. 2009లో అదే మెజారిటీ వచ్చింది. ఇక అత్యధిక మెజారిటీ అంటే 2004లో 56 వేల పై చిలుకు మెజారిటీ బాబుకు వచ్చింది. అంటే ఇవన్నీ చూస్తే 2019 నాటి మెజారిటీ దారుణంగా తగ్గింది అని భావించాలి. ఆ తరువాత చూస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని సీట్లను వైసీపీ గెలుచుకుంది.

మరో వైపు బాబు కుప్పంలో బీసీ అభ్యర్ధిగా భరత్ ని పోటీకి నిలుపుతున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. బాబు మీద గెలిస్తే మంత్రిని చేస్తామని వైసీపీ అంటోంది. లేటెస్ట్ గా చిత్తూరు జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా భరత్ ని ప్రమోట్ చేశారు., మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మీదనే కన్ను పెట్టేశారు. అక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వాలిపోతున్నారు.

ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు ఆయన సతీమణి, కుమారుడు లోకేష్ కలసి మొత్తం 17 సార్లు టూర్లు వేశారు. సొంత ఇల్లు కట్టుకోవడానికి బాబు చూస్తున్నారు. కుప్పంలో బాబుకు ఓటమి ఉండదు అని తమ్ముళ్ళు అంటున్నా హోరా హోరీ ఫైట్ అయితే తప్పదు. ఏమో రాజకీయాలో ఎవరేమి చెప్పగలరు అన్న బెంగ కూడా ఉంది.

రెండేళ్ల క్రితం మమతా బెనర్జీ సొంత సీటులో ఓటమి పాలు అయిన ఘటన ఉంది. దాంతో బాబు కూడా కేసీయార్ ని ఫాలో అంటున్నారుట. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కేసీయార్ పోటీకి సై అంటున్నారు. ఇదే ఫార్ములాను బాబు అనుసరిస్తూ గోదావరి నుంచి రెండవ సీటుకు రెడీ అవుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.