టీడీపీ నుంచి చంద్రబాబును సస్పెండ్ చేసినది ఎవరో తెలుసా...?
ఆ సమయంలో టీడీపీలో తన మీద వెన్ను పోటు కుట్ర పన్నిన చంద్రబాబు సహా మరో నలుగురి మీద నాడు పార్టీ అధ్యక్షుడిగా అన్న గారు సస్పెన్షన్ వేటు వేశారు.
By: Tupaki Desk | 25 Aug 2023 10:46 PM ISTటీడీపీ అంటే చంద్రబాబు అని, చంద్రబాబు అంటే టీడీపీ అని చాలా మంది ఈనాటి తరం అనుకుంటారు. కానీ కేవలం ఒక్కడుగా వచ్చి నాడు ఆరు కోట్ల ఆంధ్రులను ఒక్కటిగా చేసి తన బలంగా మార్చుకుని అప్పటికి మూడున్నర దశాబ్దాలుగా ఓటమి అన్నదే లేకుండా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ ని కూకటి వేళ్ళతో పెకిలించిన ఘనత ఎన్టీయార్ ది.
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బలమైన పార్టీని నిర్మించి తొమ్మిది నెలలలో అధికారంలోకి వచ్చిన గొప్పదనం ఎన్టీయార్ ది. టీడీపీని స్థాపింది 1983 అసెంబ్లీ, 1984 పార్లమెంట్, 1985 అసెంబ్లీ ఎన్నికలలో వరస విజయాలు, అప్రతిహత విజయాలను అందుకున్న వారు ఎన్టీయార్.
కాంగ్రెస్ మకిలి అంటని పార్టీగా టీడీపీని ఎన్టీయార్ రూపొందించారు. అవినీతి అక్రమాలకు దూరంగా ఉంచారు. కాంగ్రెస్ కి సరైన ఆల్టర్నేషన్ అనిపించారు. అలాంటి పార్టీలోకి కాంగ్రెస్ రక్తం తనలో ఉంచుకుని కాంగ్రెస్ మనిషిగా మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రవేశించాక టీడీపీ అచ్చంగా అదే కాంగ్రెస్ ని నకలుగా మారింది అన్నది ఘాటు విమర్శ.
ఆ మీదట 1985 నుంచి 1989 మధ్యలో అనేక ఆరోపణలు అవినీతి మీద విమర్శలు వచ్చాయంటే అది చంద్రబాబు పుణ్యమేనని నాటి టీడీపీలో ఉన్న వారు చెబుతారు. ఇక ఎన్టీయార్ మీద వంద ఆరోపణలతో విశాఖకు చెందిన కాంగ్రెస్ నేత ద్రోణం రాజు సత్యనారాయణ హై కోర్టులో కేసు వేస్తే అందులో ఏడింటి మీద ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొన్న విషయమూ విధితమే.
అలా మచ్చ లేని ఎన్టీయార్ కి మచ్చ వచ్చేలా చేసింది తెర వెనక టీడీపీలో ఉన్న చంద్రబాబే అని అసలైన టీడీపీ నేతలు అంటారు. ఇక 1989లో టీడీపీ ఓటమి వెనక కూడా బాబు నిర్వాకమే ఉందని అంటున్నారు. అయినా సరే 1994లో మళ్లీ ఎన్టీయార్ తిరుగులేని నాయకుడిగా అవతరించి బ్రహ్మాండమైన మెజారిటీతో మూడవ సారి పాలనా పగ్గాలు చేపట్టారు.
అయితే 1995 ఆగస్టులో టీడీపీలో ముసలం మొదలైంది. ఎన్టీయార్ ని తప్పించేయడానికి తాను సీఎం కావడానికి చంద్రబాబు పన్నిన వ్యూహంలో మొత్తం టీడీపీ చిక్కుకుని పోయింది. ఈ విషయం గ్రహించి ఎన్టీయార్ తేరుకునేలోగానే అంతా జరిగిపోయింది. ఆ సమయంలో టీడీపీలో తన మీద వెన్ను పోటు కుట్ర పన్నిన చంద్రబాబు సహా మరో నలుగురి మీద నాడు పార్టీ అధ్యక్షుడిగా అన్న గారు సస్పెన్షన్ వేటు వేశారు.
ఆ రోజు 1995 ఆగస్ట్ 25. టీడీపీకి వారికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన నాడు శాసనసభకు లేఖ రాశారు. అయినా అప్పటికే బాబు టీడీపీ మీద పూర్తి పట్టు సాధించారు. దాంతో ఎన్టీయార్ సస్పెన్షన్ వేటుకు ఎలాంటి ప్రభావమూ లేకుండా పోయింది. ఆ విధంగా ఎన్టీయార్ అల్లుడు చేతిలో అధికారాన్ని కోల్పోయారు. ఇది చరిత్ర. 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు.
అది లగాయితూ ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్ళ పాటు విభజన ఏపీకి అయిదేళ్ళ పాటు సీఎం గా పాలించారు. 2024 ఎన్నికల్లో మరోసారి అధికారం కోసం వైసీపీతో పోరాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీయార్ టీడీపీ నుంచి బాబుని సస్పెండ్ చేశారు. ఆ మీదట మాజీ సీఎం అయిన ఎన్టీయార్ అనేక టీవీ చానళ్ళు మీడియా సమావేశాలలో చంద్రబాబుని విమర్శించారు. మరో ఔరంగజేబ్ అన్నారు. చంద్రబాబు సైతం ఎన్టీయార్ మీద విమర్శలు చేశారు.
ఇలా 1995 దాకా సాగిన మామా అల్లుళ్ళ రాజకీయ సమరానికి 1996 జనవరి 18న ఎన్టీయార్ కన్నుమూతతో తెర పడిపోయింది. ఇక ఎన్టీయార్ స్థాపించిన టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్ అయ్యారు. నైతికంగా చూస్తే ఆయనకు ఎన్టీయార్ పెట్టిన పార్టీతో సంబంధం లేదు. కానీ చట్టప్రకారం చూస్తే పార్టీకి ఆయన ప్రెసిడెంట్.
రాజకీయాల్లో అన్నీ సాధ్యం అని ఎంత మాట్లాడుకున్నా రాజకీయాలకు అతీతంగా ఎన్టీయార్ మాత్రం తన అల్లుడు అని కూడా చూడకుండా బాబుని సస్పెండ్ చేశారు. అదే విషయాన్ని ప్రతీ ఆగస్ట్ నెలలో ప్రత్యేకించి ఆగస్ట్ 25న నిజమైన ఎన్టీయార్ భక్తులు అభిమానులు తలచుకుంటూనే ఉంటారు. వారి దృష్టిలో అన్న గారి టీడీపీ ఆయనతోనే వెళ్ళిపోయింది. అది అంతే అంటారు.
