Begin typing your search above and press return to search.

మూడు కీలక నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులు వీరే!

చంద్రబాబు తాజాగా అభ్యర్థులను ప్రకటించిన కడప, ప్రత్తిపాడు, రాయదుర్గం మూడింటిలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 8:00 AM GMT
మూడు కీలక నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులు వీరే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని తలపోస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒక్క చాన్సు అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆయన పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది.

మరోవైపు ఎక్కడికక్కడ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. వారిని ప్రజలకు పరిచయం చేస్తూ గెలిపించాలని ప్రజలకు విన్నవిస్తున్నారు. తాజాగా మూడు కీలక నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు.

కడప నియోజకవర్గానికి ఇంచార్జిగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవీ రెడ్డిని ప్రకటించారు. అలాగే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.రామాంజనేయులను ఎంపిక చేశారు. ఇక అనంతపురం జిల్లా రాయదుర్గానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను అభ్యర్థిగా ప్రకటించారు.

కాగా చంద్రబాబు తాజాగా అభ్యర్థులను ప్రకటించిన కడప, ప్రత్తిపాడు, రాయదుర్గం మూడింటిలో ప్రస్తుతం వైసీపీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కడప నుంచి వైసీపీ అభ్యర్థి అంజాద్‌ బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జగన్‌ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమె జగన్‌ మొదటి విడత మంత్రివర్గంలో హోం శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో మంత్రివర్గ విస్తరణలో ఈమెకు పొడిగింపు దక్కలేదు.

ఇక రాయదుర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన ప్రభుత్వ విప్‌ గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2014లో ఇక్కడ టీడీపీ తరఫున గెలిచిన కాలువ శ్రీనివాసులు.. చంద్రబాబు మంత్రివర్గంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో ఇక్కడే నుంచే బరిలోకి దిగిన కాలువ.. వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా కాలువ శ్రీనివాసులు 1999లో అనంతపురం ఎంపీగా టీడీపీ తరఫున విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో మరోసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

కాగా ప్రత్తిపాడులో 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన రావెల కిశోర్‌బాబు విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత వివాదాస్పద కారణాలతో పదవిని పోగొట్టుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ప్రత్తిపాడులో ఓటమి పాలయ్యారు.

2009లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సుచరిత 2012 ఉప ఎన్నికలో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. 2014 వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు.

ఈ నేపథ్యంలో టీడీపీ మరోసారి కొత్త అభ్యర్థిని ప్రత్తిపాడు బరిలో దించుతోంది. ఐఏఎస్‌ అధికారిగా ఏపీ కేడర్‌ లో పలుశాఖల్లో పనిచేసిన బి.రామాంజనేయులను అభ్యర్థిగా ప్రకటించింది. ఇదే కోవలో కడపలోనూ కొత్త అభ్యర్థిని బరిలో దించుతోంది.