Begin typing your search above and press return to search.

మోడీ అమిత్ షా కోసం టీడీపీ కూటమి ఎదురుచూపులు !

అయితే గేర్ మార్చి స్పీడ్ పెంచాలి అంటే కేంద్ర బీజేపీ దిగ్గజ నేతలు రావాల్సిందే అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2024 3:41 AM GMT
మోడీ అమిత్ షా కోసం టీడీపీ కూటమి ఎదురుచూపులు !
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రచారం సాగుతోంది. మొత్తం భారాన్ని అంతా రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు మోస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు రోజుల పాటు జరిగిన ఉమ్మడి ప్రచార సభ్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మరిన్ని సభలలో ఆయన పాల్గొంటారు. బాబు పవన్ నిర్వహించిన ఉమ్మడి ప్రచారానికి ఒక మాదిరి స్పందన లభిస్తోంది. అయితే గేర్ మార్చి స్పీడ్ పెంచాలి అంటే కేంద్ర బీజేపీ దిగ్గజ నేతలు రావాల్సిందే అంటున్నారు.

ఎందుకంటే గత అయిదేళ్ళుగా చంద్రబాబు జనంలోనే ఉన్నారు. పవన్ సైతం వారాహి యాత్రలు అంతకు ముందు పర్యటనలతో వైసీపీని జగన్ ని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. ఇపుడు ఎన్నికల వేళ కూడా కొత్తదనం ఏమీ కనిపించడం లేదు అంటున్నారు. వారు ఏమి చెప్పినా రొటీన్ గానే జనాల్లోకి వెళ్తోంది.

దాంతో జగన్ మీద బీజేపీ పెద్దన్నలు పవర్ ఫుల్ డైలాగులతో విరుచుకుపడితే కూటమి బండి దూకుడు చేస్తుంది అని అంటున్నారు. ఇతర రాష్ట్రాలలో మోడీ అమిత్ షా రాజకీయ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించేలా మాట్లాడుతూంటారు. అలాంటి స్ట్రాంగ్ డోస్ ఏపీలో కూడా ఉంటేనే కూటమికి ఆక్సిజన్ వస్తుందని అంటున్నారు. ఏపీలో గత అయిదేళ్ల పాలనలో ఫలనా రంగంలో అవినీతి చేశారని చెప్పాలి. అలాగే ఏపీలో అభివృద్ధికి తాము ఎంత ఇచ్చామో చెప్పాలి. ఏపీ ప్రభుత్వం ఎంత వరకూ ఖర్చు చేసింది చేయలేదు వివరించాలి.

అవినీతి చేసిన వారిని ఎంతకైనా శిక్షిస్తామని చెబితే అపుడు జనాల్లో జోష్ వస్తుంది. అంతే తప్ప జగన్ ని జైలు కి పంపిస్తామని ఏపీ కూటమి నేతలు అంటే అందులో కక్ష సాధింపు కనిపిస్తుంది తప్ప కిక్కు ఇవ్వదు. ఇదిలా ఉంటే ఏపీలో ప్రచారానికి కేంద్ర బీజేపీ నేతలు ఎవరు వస్తున్నారు అన్నది చర్చగా ఉంది.

తాజాగా చంద్రబాబు ఇంట్లో జరిగిన కూటమి మీటింగ్ కి బీజేపీ కీలక నేతలు వచ్చారు. వారితో జాతీయ నాయకుల ఏపీ పర్యటనల గురించి చర్చించినట్లుగా తెలిసింది. మరోసారి నరేంద్ర మోడీ ఏపీకి వస్తారని అలాగే అమిత్ షా తో పాటు జేపీ నడ్డా కీలక కేంద్ర మంత్రులు ఏపీకి వస్తారు అని అంటున్నారు.

నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో పెద్దగా జగన్ మీద విమర్శలు చేయలేదు. ఈసారి ఆయన వస్తే ఎంతమేరకు చేస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే అమిత్ షా ఏపీకి వస్తే మాత్రం జగన్ మీద సూటిగా ధాటిగా విమర్శలు చేస్తారు అని అంటున్నారు. దాంతో కూటమి నేతలు అమిత్ షా పర్యటన మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అలాగే ఏపీలో కాస్తా మాటకారులు గా ఉన్న కేంద్ర మంత్రులను కూడా ప్రచారానికి పంపమని కోరుతున్నారని అంటున్నారు.

పదేళ్ళ క్రితం జరిగిన ఏపీ ఎన్నికలను తీసుకుంటే కేవలం ఒక్క వారంలోనే కూటమి వైపు మొత్తం సానుకూలత వచ్చింది. దానికి కారణం ఆనాడు మోడీ ఏపీలో వరసగా టూర్లు చేయడం, తిరుపతి నుంచి మొదలెట్టి విశాఖ దాకా సభలు నిర్వహించడం. అందులో చంద్రబాబు పవన్ పాల్గొనడంతో పాటు ఈ కూటమి అధికారంలో అక్కడా ఇక్కడా వస్తే విభజన ఏపీకి ఎనలేని మేలు జరుగుతుందని ప్రజలు నమ్మారు. దాంతో 2014 మార్చి 25 వరకూ వైసీపీకి కనిపించిన ఊపు ఆ తరువాత తగ్గి కూటమి వైపుగా మళ్ళింది. అప్పట్లో కూటమి విజయం సాధించింది.

ఇపుడు అలాంటి గేర్ మార్చే సత్తా కూటమి నేతలకు ఉందా అంటే ఫిఫ్టీ ఫిటీ చాన్సెస్ అని అంటున్నారు. ఎందుకంటే కూటమి పాలనను ఏపీలో ఒకసారి జనాలు చూశారు ఇక బీజేపీ కేంద్రంలో పదేళ్ళుగా అధికారంలో ఉంది. ఏపీకి ఏమి చేసింది విభజన హామీలు ఎంతవరకూ నెరవేర్చింది అన్నది ప్రజలకు తెలుసు. అందువల్ల 2014 నాటి మోజూ క్రేజూ ఇపుడు ఉండవనే అంటున్నారు.

దాంతో ఇపుడు వైసీపీ మీద వ్యతిరేకత ఎంత ఉంటే అంతలా కూటమికి టర్న్ అవుతుంది అని అంటున్నారు. ఏది జరిగినా ఏమి చేసినా ఏప్రిల్ చివరి వారంలో గానే కూటమికి అనుకూలంగా వేవ్ క్రియేట్ చేయగలగాలి. అలా కాకుండా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవని అంటున్నారు. నామినేషన్ల దాఖలు తరువాత కేంద్ర బీజేపీ పెద్దల వరస టూర్లు ఏపీ లో ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి వాటి ప్రభావం కూటమి మీద ఏ మేరకు ఉంటుందో.