Begin typing your search above and press return to search.

టీడీపీలో కొట్టుకున్న తమ్ముళ్లు.. కొత్త ఇంచార్జి పదవుల కోసం కొట్లాట!

అయితే మంత్రుల సమక్షంలోనే కార్యకర్తలు కొట్లాటకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు తీవ్ర గాయాల పాలయ్యారని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   13 July 2026 7:36 PM IST
టీడీపీలో కొట్టుకున్న తమ్ముళ్లు.. కొత్త ఇంచార్జి పదవుల కోసం కొట్లాట!
X

తిరుపతి వేదికగా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జి నియామకంపై సమావేశం జరగగా, పుంగనూరు ఇంచార్జిని మార్చాలంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జిగా పనిచేసిన దాసరపల్లె జయచంద్రారెడ్డిని ములకలచెరువు మద్యం కల్తీ కేసులో ఆరోపణలతో తొలగించారు. ఆయన స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించేందుకు కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాల్సిందిగా అధిష్టానం మంత్రులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దనరెడ్డికి బాధ్యత అప్పగించింది. అయితే మంత్రుల సమక్షంలోనే కార్యకర్తలు కొట్లాటకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు తీవ్ర గాయాల పాలయ్యారని చెబుతున్నారు.

వాస్తవానికి తిరుపతిలో తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జి ఎంపికపై సమావేశం జరగాల్సివుండగా, పుంగనూరు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి తొలుత తంబళ్లపల్లి కార్యకర్తల అభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో జయచంద్రారెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున గుమికూడా తమకు ఫోన్లు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇంచార్జి పదవి ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు వారితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి కొట్లాట చోటుచేసుకుంది. దీంతో సమావేశం రసాభాసగా మారింది.

మరోవైపు సోమవారం జరిగే కార్యకర్తల అభిప్రాయ సేకరణకు తన అనుచరులకు ఫోన్లు రాలేదని, నిజమైన కార్యకర్తలను పార్టీ పక్కన పెడుతోందని ఆరోపిస్తూ ఆదివారం నాడే మాజీ ఇంచార్జి జయచంద్రారెడ్డి ఎక్స్ వేదికగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పార్టీ ఇంచార్జి నియామకంలో అసలైన కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దని, కోవర్టుల నుంచి పార్టీని కాపాడుకోవాలంటూ ఆయన వీడియోలో కోరారు.

తంబళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గానికి జయచంద్రారెడ్డి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో శంకర్ యాదవ్ ను కాదని వైసీపీ నుంచి వచ్చిన జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ములకలచెరువు మద్యం కల్తీ వ్యవహారంలో జయచంద్రారెడ్డిపై ఆరోపణలు రాగా, పార్టీ అధిష్టానం ఆయనపై వేటు వేసింది. తాజాగా శంకర్ యాదవ్ కు మళ్లీ ఇంచార్జిగా నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే అనుమానంతో ఆయన అనుచరులు గొడవకు దిగారని చెబుతున్నారు. మొత్తానికి మంత్రుల సమక్షంలోనే కార్యకర్తలు బాహాబాహీకి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.