పసుపు వర్ణం.. అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు!
ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా టీడీపీకి చెందిన మొత్తం మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన డ్రెస్ కోడ్ తో అసెంబ్లీకి హాజరయ్యారు.
By: Tupaki Desk | 15 Feb 2026 12:27 AM ISTఏపీ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా టీడీపీకి చెందిన మొత్తం మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన డ్రెస్ కోడ్ తో అసెంబ్లీకి హాజరయ్యారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కలిశారు. మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్ లో హాజరుకావడంపై అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ జరిగింది. ముందుగా నిర్ణయించుకుని అంతా ఒకే రకమైన చీరలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీకి పసుపు పండుగ తీసుకొచ్చారంటూ టీడీపీ కార్యకర్తలు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
అసెంబ్లీలో మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యేని మినహాయిస్తే 21 మంది కూటమి పార్టీల్లో ఉన్నారు. వీరిలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వారే. వీరంతా శనివారం పసుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పసుపు చీరలు కట్టుకున్నా కాస్త భిన్నమైన రంగులో కనిపించారు. అదేవిధంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాత్రం సహచర ఎమ్మెల్యేలకు భిన్నమైన విధంగా నీలం రంగు చీరలో అసెంబ్లీకి వచ్చారు. అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా కాస్త భిన్నంగా లేత రంగు చీరలో అసెంబ్లీకి వచ్చారు. అదే సమయంలో జనసేనకు చెందిన నెల్లిమర్ల లోకం మాధవి సైతం తన పార్టీ జెండాలోని ఎరుపు, టీడీపీకి చెందిన పసుపు రంగు చీరతో అసెంబ్లీకి వచ్చారు.
ఇక మిగిలిన ఎమ్మెల్యేలు అంతా ఒకే రకమైన ముదురు పసుపు రంగు చీర, కుంకుమ రంగు అంచు ఉన్న చీరతో అసెంబ్లీకి హాజరయ్యారు. అందరూ ఒకేరకమైన డ్రెస్ కోడ్ ధరించడం అసెంబ్లీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. మహిళా ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీకి రావడం వెనుక ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. పసుపు రంగు ఐక్యతకు, విజయానికి సంకేతంగా చెబుతారు. ఈ కారణంగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన డ్రెస్ లో సభకు వచ్చారని అంటున్నారు.
ఇలా ఒకే రకమైన డ్రెస్ కోడ్ తో సభకు వచ్చిన మహిళా నేతల్లో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సవిత కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరుసైతం సహచర ఎమ్మెల్యేలు మాదిరిగా ఒకే రకమైన డ్రెస్ ధరించారు. వీరంతా అసెంబ్లీ లాబీల్లో సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. చంద్రబాబుతో గ్రూపు ఫొటో దిగారు. మహిళా నేతల సందడితో అసెంబ్లీలో పసుపు పండగ స్పష్టంగా కనిపించింది. టీడీపీలో ఎమ్మెల్యేలు, నేతలు ఇలా పసుపు రంగు డ్రెస్ లు ధరించి సభలు, సమావేశాలకు హాజరుకావడం సర్వసాధారణం. పార్టీ సమావేశాల్లో నేతలు అంతా పసుపు చొక్కాలే ఎక్కువగా ధరిస్తారు. అయితే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అందరూ ఒకే రకమైన చీరలతో రావడమే విశేషంగా చెబుతున్నారు. వీరిని ఇలా చూసిన వారు టీడీపీ మహిళా దళం.. అంతా ఒక్కటే గళం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
