Begin typing your search above and press return to search.

వీ ఫర్ వర్మ...ఆర్ ఫర్ రాధా...వెయిటింగ్ లిస్టు కంటిన్యూ !

ఇక వంగవీటి రాధా అయితే 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు.

By:  Satya P   |   10 Jun 2026 8:30 AM IST
వీ ఫర్ వర్మ...ఆర్ ఫర్ రాధా...వెయిటింగ్ లిస్టు కంటిన్యూ !
X

తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ఆశావహుల పేర్లు ప్రతీ సారీ వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా నామినేట్ పదవుల భరీ జరిగినపుడు కానీ లేదా పెద్దల సభకు ఎన్నికలు జరిగినపుడు కానీ ఈ ఇద్దరు సీనియర్ నేతల పేర్లు చర్చకు వస్తూంటాయి. వారే వంగవీటి రాధాక్రిష్ణ అలాగే ఎస్వీఎస్ ఎన్ వర్మ. అలియాస్ పిఠాపురం వర్మ. ఈ ఇద్దరికీ 2024 ఎన్నికలో అసెంబ్లీ లేదా పార్లమెంట్ టికెట్లను పార్టీ సర్దుబాటు చేయలేకపోయింది. దానికి కారణం మూడు పార్టీల పొత్తుతో కూటమి ఏర్పాటు కావడమే. అలా త్యాగం చేసిన వీరు తమ పార్టీ విజయం కోసం అధినాయకత్వం సూచనల మేరకు ఎంతోగానో కష్టించి పనిచేశారు. కూటమి అభ్యర్ధులకు విజయాన్ని చేకూర్చడంతో తమ వంతుగా కృషి చేసి సక్సెస్ అయ్యారు.

రాధాకు నిరాశ :

ఇక వంగవీటి రాధా అయితే 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అక్కడ సీనియర్ నేత బోండా ఉమా ఉండడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. అలా రాధాకు కొంత నిరాశ కలిగింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా మరే అవకాశం అయినా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ పదవులు అయితే కూటమి ప్రభుత్వంలో అరడజన్ దాకా భర్తీ అయ్యాయి కానీ రాధాకు చాన్స్ దక్కలేదు. దాంతోనే ఆయన అనుచరవర్గం డీలా పడింది అని అంటున్నారు. తమ నాయకుడు ఎమ్మెల్సీ అయి ఆ మీదట మంత్రి కూడా అవుతారు అని అనుకున్న వారికి ఇది కొంత కలత చెందే అంశగా మారింది. మరో వైపు చూస్తే రాజ్యసభ సీటు ఒకటి రాధాకు కన్ ఫర్మ్ చేసారు అని కూడా ప్రచారం గత కొంతకాలంగా జరుగుతూ వచ్చింది. టీడీపీకి మూడు రాజ్యసభ సీట్లు ఈసారి వచ్చాయి. కానీ ఏ దశలోనూ రాధా ప్రస్తావన లేకుండా పోయింది అని గుర్తు చేస్తున్నారు.

వర్మకు వరం లేదా :

అదే విధమైన సన్నివేశం పిఠాపురం వర్మ విషయంలోనూ జరుగుతోంది అని అంటున్నారు. ఆయన కూడా 2024 ఎన్నికల్లో కచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేసి గెలవాలని అనుకున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తీరా ఎన్నికలు దగ్గర పడిన తరువాత ఆయన సీటుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. అలా పవన్ కి పిఠాపురం కన్ ఫర్మ్ కావడంతో వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేశారు పెద్దలు. కానీ ఈ రోజు దాకా అలాంటిది ఏదీ లేకపోగా ఒక ఎమ్మెల్సీ పదవిని నాగబాబుకు ఇవ్వడం కూడా వర్మ వర్గీయులకు కొంత అసంతృప్తిని రేకెత్తించింది అని అంటున్నారు. ఇటీవల వర్మని పిఠాపురం ఇంచార్జి పదవి నుంచి కూడా తప్పించేశారు. దాంతో ఆయన అనుచరులు మరింతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశలన్నీ అక్కడికే :

అయితే ఈ ఇద్దరి నేతల విషయం టీడీపీ పెద్దల పరిశీలనలో ఉందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయింది అని అంటున్నారు. వచ్చే ఏడాది అంటే 2027లో ఏకంగా 18 దాకా ఎమ్మెల్సీ సీట్లు ఏపీలో ఖాళీ అవుతున్నాయని అందులో నుంచి కచ్చితంగా రెండు సీట్లు ఒకటి రాధాకు ఒకటి వర్మకు దక్కే సూచనలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఈ ఇద్దరూ పార్టీకి చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని కచ్చితంగా తగిన న్యాయం చేస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే ఉందిలే మంచి కాలం అని ఈ నేతలు ఇద్దరూ వారి అనుచరులు ప్రస్తుతానికి పాడుకోవడమే అని అంటున్నారు.