సూపర్ సిక్స్ హామీల క్రెడిట్ పవన్ కి ఎంత ?
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచింది. కూటమికి పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం తన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తోంది
By: Tupaki Desk | 29 Jun 2025 7:00 PM ISTఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచింది. కూటమికి పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం తన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తోంది. నిజానికి చూస్తే కనుక ఎన్నికల మానిఫేస్టోని కూటమి విడుదల చేసింది. అందులో సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయి. ఆ మేనిఫేస్టోని తీసుకోవడానికి కూడా ఆనాటి బీజేపీ నాయకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అంటే హామీలను నెరవేర్చడం మీ వంతు అన్నట్లుగానే వదిలేశారు అన్న మాట.
సరే ఎవరేమనుకున్నా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. హామీల విషయంలో టీడీపీనే మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఆ క్రెడిట్ ని తన ఖాతాలోనే వేసుకుంటోంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కూటమిలో మరో పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన సైతం ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీల మేనిఫేస్టోని పట్టుకుంది. జనాలకు దాని మీద ప్రచారం చేసింది.
మరిప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతూంటే వాటిని టీడీపీ మాత్రమే ప్రచారం చేసుకుంటోంది. రేపటి రోజున అంటే జూలై నెల మొదటి వారం నుంచి టీడీపీ క్యాడర్ ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు. సూపర్ సిక్స్ హామీలు తాము ఇచ్చామని చెప్పబోతున్నారు. ఆ విధంగా ఆ క్రెడిట్ మొత్తం టీడీపీకి దక్కబోతోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే జనసేన కూడా తాను సొంతంగా కొన్ని హామీలు 2024 ఎన్నికల ముందు జనాలకు ఇచ్చింది. వారాహి రధం మీద పవన్ జిల్లాల టూర్లు వేస్తూ అనేక రకాలైన హామీలు ఇచ్చారు. అయితే అందులో మచ్చుకు కొన్ని కూడా అమలు కాదు కదా ఆ ప్రయత్నం ఏమైనా చేసారా అన్న చర్చ కూడా ఉంది.
ఉదాహరణకు చూస్తే కనుక నిరుద్యోగ యువతకు పది లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ఆర్దిక సాయం చేస్తామని ఆ సొమ్ముతో వారు చిన్న తరహా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చూస్తామని జనసేన పేర్కొంది. ఈ హామీ మీద అప్పట్లో బాగా చర్చ కూడా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ హామీ విషయమే ఏమీ తెలియడం లేదు అని అంటున్నారు.
అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని వారి డిమాండ్ అయిన సీపీఎస్ ని రద్దు చేస్తామని ఇప్పటం సభలో పవన్ చెప్పి ఉన్నారు. మరి దాని సంగతి ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని కూడా చెబుతూ వచ్చింది. అయితే టీడీపీ సూపర్ సిక్స్ హామీల విషయంలోనే కూటమి ఇబ్బందులు పడుతోంది. దాంతో జనసేన వెనక్కి తగ్గిందా లేక కూటమి హామీలే తన హామీలుగా మార్చుకుందా అన్నది చర్చగా ఉంది.
ఒకవేళ అదే జరిగితే సూపర్ సిక్స్ లో క్రెడిట్ జనసేనకు కూడా దక్కాలి కదా అన్న మాట వినిపిస్తోంది. అలా కాదూ కూడదు అంటే జనసేన తనదైన హామీలను అమలు చేయడం ద్వారానే జనంలో గుర్తింపు గౌరవం తెచ్చుకోగలదని అంటున్నారు. మరి సూపర్ సిక్స్ విషయంలో మాత్రం ఎక్కడా జనసేన కానీ బీజేపీ కానీ కనిపించడం లేదు అన్న చర్చ సాగుతోంది. బీజేపీ అయితే ఈ ఎన్నికల హామీలతో సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించింది కాబట్టి క్లెయిం చేయలేకపోవచ్చు కానీ జనసేన అలా కాదు కదా అని గుర్తు చేస్తున్నారు. చూడాలి మరి జనసేన తన రాజకీయ పనితీరుని ఏ విధంగా జనంలో పెట్టి మెప్పు మన్నన పొందుతొందో అన్నది.
