'నీ తల ఎందుకు తీయకూడదు' జగన్ పై బుచ్చయ్య చౌదరి ఫైర్
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై టీడీపీ మాటల దాడి కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 20 Jun 2025 5:05 PM ISTమాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై టీడీపీ మాటల దాడి కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఆ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన పోస్టర్లపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తాము 2029లో అధికారంలోకి వస్తే ‘రప్పా.. రప్పా.. నరికేస్తాం’ అనే పోస్టరు అత్యంత వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గురువారం మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్ దృష్టికి ఈ విషయాన్ని మీడియా తీసుకువెళ్లగా, పుష్పా సినిమాలో డైలాగ్ చెప్పడం కూడా తప్పేనా? అంటూ విషయాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు. అయితే జగన్ స్పందనపైనా అధికార పార్టీ అసహనం వ్యక్తం చేస్తోంది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వంటి వారు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టగా, టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అయిన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బుచ్చయ్య చౌదరి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘అర్జంటుగా అధికారంలోకి రావడం కోసం నీ రౌడీ మూకలు వెంటేసుకుని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనివ్వం. ఇదే విధానం కొనసాగిస్తామంటే నిన్ను ఎక్కడ కట్టిడి చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను. అందరి తలలు తీస్తానంటే, నీ తల ఎందుకు తీయకూడదు అని ప్రశ్నించ కూడదు’ అని ప్రశ్నించారు బుచ్చయ్యచౌదరి. అంతేకాకుండా ‘‘తలలు నరుకుతాం, మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే సాగదు’ అని కుండ బద్ధలు కొట్టారు. తమకు కూడా ఓర్పు, సహనం ఉందని బుచ్చయ్య వ్యాఖ్యానించారు.
ఓపిక నశించి టీడీపీ కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో తెలుసుకో జగన్ అంటూ బుచ్చయ్య హెచ్చరించారు. జగన్ చేసిన తప్పులు అన్నీ సరిచేసుకుని తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రోడ్డుపై తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దంటూ జగన్ కి హితవు పలికారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండేలా పాలన సాగిస్తోందని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
