ఎన్టీఆర్‌కు 'భారత రత్న'...చంద్రబాబు ఏమన్నారంటే
తాజాగా జరిగిన మహానాడు రెండో రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రసంగించిన చంద్రబాబు.. పలు అంశాలను ప్రస్తావించారు.
By: Garuda Media | 29 May 2026 1:49 AM ISTటీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. మాజీ సీఎం ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలన్నది రెండు దశాబ్దాలుగా వినిపిస్తున్న నినాదమే. ఎప్పటికప్పుడు.. ఈ విషయంపై చర్చించడం.. తర్వాత మౌనం పాటించడం కూడా కనిపిస్తూనే ఉంది. అయితే.. ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌కు భారత రత్న తీసుకువస్తామని.. కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తామని.. స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు జాతి గౌరవాన్ని వినువీధికి వ్యాపింపజేసిన ఎన్టీఆర్‌కు భారత రత్న తీసుకురావడమే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.
తాజాగా జరిగిన మహానాడు రెండో రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ప్రసంగించిన చంద్రబాబు.. పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడికి భారత రత్న ఇవ్వాలన్న తీర్మా నాన్ని స్వయంగా ఆయనే ప్రవేశ పెట్టి.. దానిపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. యుగ పురుషుడిగా చంద్రబాబుపేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. సినిమా రంగమైనా.. రాజకీయా లైనా.. ఆయనను మించిన వారు లేరని చెప్పారు.
సినిమా రంగంలో ఆయన వేసిన వేషాలను మరెవరూ వేయలేరన్న చంద్రబాబు.. కృష్ణుడు, రాముడు వంటి పాత్రలను వేయాలంటే.. ప్రజలను మెప్పించాలంటే.. మళ్లీ ఎన్టీఆరే జన్మించాలని అన్నారు. అలానే.. పార్టీని పెట్టి కేవలం 9 మాసాల్లోనే దానిని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత, చరిత్ర కూడా ఎన్టీఆర్ సొంతమని పేర్కొన్నారు. ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది తెలుగు వారి ఆకాంక్షగా పేర్కొన్నారు.
ఈ విషయంపై కేంద్రంతో మరోసారి చర్చించనున్నట్టు తెలిపారు. ఈ సారి ఖచ్చితంగా ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తెలుగు జాతి.. ఉన్నంత వరకు ఎన్టీఆర్ చరిత్ర కొనసాగుతుందన్నారు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు- అన్న ఎన్టీఆర్ నినాదం శాశ్వతమని పేర్కొన్నారు.
