లోక్ సభలో టీడీపీ ఎంపీ షాకింగ్ డెసిషన్.. షాక్ తిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్?
టీడీపీ నేత, బాపట్ల లోక్ సభ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ లోక్ సభను షేక్ చేశారు. విపక్ష పార్టీలు షాక్ తినేలా ఆయన వ్యవహరించిన తీరు పార్లమెంటులో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Desk | 4 Feb 2026 2:14 PM ISTటీడీపీ నేత, బాపట్ల లోక్ సభ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ లోక్ సభను షేక్ చేశారు. విపక్ష పార్టీలు షాక్ తినేలా ఆయన వ్యవహరించిన తీరు పార్లమెంటులో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరిస్తున్న కృష్ణప్రసాద్ మంగళవారం కాసేపు లోక్ సభ ప్యానెల్ స్పీకర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా సభలో విపక్షం నిరసనలతో హోరెత్తించగా, విపక్షం నుంచి ఓ సభ్యుడు నాన్ పార్లమెంటరీ పదాన్ని వాడటంపై సభాధ్యక్ష స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను మూకుమ్ముడిగా చుట్టుముట్టినా, ఆయన వెనక్కి తగ్గకపోవడం అధికార కూటమి సభ్యులను ఆకర్షించింది. సభ వాయిదా అనంతరం కృష్ణప్రసాద్ వ్యవహరించిన తీరుపై సభ్యులు మధ్య విస్తృత చర్చ జరిగింది.
బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ లోక్ సభ చట్టంపై మంచి అవగాహనతో పనిచేస్తున్నారని మంగళవారం నాటి ఘటన చాటిచెప్పిందని అంటున్నారు. కృష్ణప్రసాద్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. సర్వీసులో ఉండగా, తెలంగాణ డీజీపీగా కొద్దిరోజులు పనిచేశారు. గత ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్ బాపట్ల టికెట్ దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఇక పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టిన కృష్ణప్రసాద్ కు ప్యానెల్ స్పీకర్ హోదా దక్కింది.
అయితే మంగళవారం ఆయన ప్యానెల్ స్పీకర్ హోదాలో లోక్ సభ కార్యాకలాపాల నిర్వహణ బాధ్యతలు దక్కాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో జాతీయ భద్రతపై రాహుల్ మాట్లాడే ప్రయత్నం చేయగా, అధికార పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ సీట్లో ఉన్న కృష్ణప్రసాద్ జోక్యం చేసుకుని రాహుల్ ప్రసంగాన్ని నిలువరించారు. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడటానికి మాత్రమే పరిమితం కావాలని సూచించారు. ఇదే సమయంలో మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతుండగా, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో స్పీకర్ కృష్ణప్రసాద్ అవకాశం ఇవ్వలేదు.
ఇలా వాడివేడి చర్చ సాగుతున్న క్రమంలో ఓ కాంగ్రెస్ సభ్యుడు ‘వాటీజ్ దిస్ యార్’ అని వ్యాఖ్యానించారు. దీంతో ప్యానెస్ స్పీకర్ కృష్ణప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ ను ఉద్దేశించి ‘వాటీజ్ దిస్ యార్’ అనడమేంటి? అంటూ కాంగ్రెస్ ఎంపీలపై సీరియస్ అయ్యారు. ఇది పార్లమెంటు, లోక్ సభ అధ్యక్ష స్థానాన్ని ఎలా పడితే అలా పిలుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు కొందరు సీనియర్ సభ్యులు ‘యార్’ అంటే తప్పేంటి అని ప్రశ్నించినా, ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ తిప్పికొట్టారు. సభా మర్యాదలు, సభాధ్యక్ష స్థానానికి గౌరవం ఇవ్వాలని స్పష్టం చేశారు.
అయినప్పటికీ లోక్ సభలో గందరగోళం తగ్గలేదు. కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇతర సభ్యులు పోడియం ముందుకు వచ్చి గొడవ చేశారు. కాగితాలు చించేసి ఎగరవేయడంతో ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. ఇక సభ వాయిదా పడిన తర్వాత ఎంపీ కృష్ణప్రసాద్ ను సహచర ఎంపీలు అభినందించడం కనిపించింది. తొలిసారి ఎంపీగా గెలిచినా సమర్థంగా వ్యవహరించారని ఆయనను ఎంపీలు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన చదువు, చట్టంపై లోతైన అవగాహన, వ్యవస్థలను నడిపే తీరుపై వారి మధ్య కాసేపు చర్చ జరిగింది.
