Begin typing your search above and press return to search.

చంద్రబాబు పాలనపై అసంతృప్తి? టీడీపీ ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వైరల్

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బాంబు పేల్చారు.

By:  Tupaki Desk   |   10 Feb 2026 9:18 AM IST
చంద్రబాబు పాలనపై అసంతృప్తి? టీడీపీ ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వైరల్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బాంబు పేల్చారు. ‘‘రోడ్లు లేవు.. ఉద్యోగాలు లేవు.. పల్లె కన్నీరు పెడుతోంది’’ అంటూ సదరు ఎమ్మెల్యే తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టి కలకలం రేపారు. ఈ విషయం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తున్నా, అధిష్టానం ఉపేక్షిస్తుండటంతో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నట్లు నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎవరూ లేనట్లు ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారారని అంటున్నారు.

కూటమి సర్కార్ పాలనపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో వివాదాలతో కొలికపూడి ఎప్పటికప్పుడు చర్చలకు ప్రధాన కేంద్రం అవుతున్నారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నితో విభేదాలు వల్ల ఎమ్మెల్యే పార్టీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను, అధిష్టానాన్ని మరింత రెచ్చగొట్టేలా తాజాగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి.

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సరిగా లేదన్న భావన కలిగేలా పరోక్ష విమర్శలు చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి పెట్టిన వాట్సప్ స్టేటస్ సంచలనంగా మారింది. ‘‘3 వారాల పాటు 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపాను..రోడ్లు లేని పల్లెలు…ఉద్యోగాలు రాని పిల్లలు…పల్లె కన్నీరు పెడుతోంది…’’ అంటూ కొలికపూడి తన ఫోన్ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. అధికార పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.

రాజధాని అమరావతి ఉద్యమకారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి తొలి నుంచి టీడీపీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ టికెట్ ను కొలికపూడి కైవసం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ప్రతిపక్షానికి చెందిన ఓ మండలస్థాయి నాయకుడి భవనాన్ని కూల్చేయాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, బుల్డోజర్ తో ఆ నేత ఇంటికి వెళ్లడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఇక ఆ రోజు నుంచి నేటి వరకు ఆయనను ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉందని చెబుతున్నారు.

సొంత నియోజకవర్గంలో కేడర్ తో వివాదలు పెట్టుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పించిన ఎంపీ కేశినేని చిన్నిపైనా గతంలో అవినీతి ఆరోపణలు చేసి కలకలం రేపారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ తన నుంచి డబ్బు తీసుకున్నారని బహిరంగ ఆరోపణలు చేసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పార్టీ క్రమశిక్షణ సంఘం చేపట్టిన విచారణలో తేలిందని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీ పరువు బజారుకీడుస్తున్న ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అధినేత చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.

ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ సంఘం సూచించినా, ఆ నివేదికను సీఎం చంద్రబాబు తొక్కి పెట్టారని అంటున్నారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే విషయంలో నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో సీఎం సహనాన్నే పరీక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి మరో సారి తన వైఖరి బయటపెట్టారని అంటున్నారు. ఇక గతంలో కూడా మద్యం అమ్మకాలు, పేకాట క్లబ్బులపై ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రకటనలు చేశారు. అప్పుడూ కూడా పార్టీ హైకమాండ్ ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు.

ఇక కొద్ది రోజుల క్రితం నందిగాం నియోజకవర్గ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లగా, ఎమ్మెల్యే కొలికపూడి సీఎం చంద్రబాబుకు నమస్కరించారు. ఆ సమయంలో ఎమ్మెల్యేను అసలు పట్టించుకోకుండా సీఎం ముందుకు వెళ్లిపోయారు. ఆ సంఘటనతో ఎమ్మెల్యే నొచ్చుకున్నారని, దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపైన, పార్టీ నేతలపైన విమర్శలకు దిగుతూ అందరి సహనాన్ని పరీక్షిస్తున్నారని అంటున్నారు. తాజా వాట్సాప్ స్టేటస్ తో తన వైఖరి మరోసారి బయటపెట్టడం చూస్తుంటే ఆయన పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారని అంటున్నారు.