పసుపు కెరటాల మధ్యన వైసీపీ అడ్రస్ గల్లంతు ?
అలాంటిది గిర్రున అయిదేళ్ళు తిరగకుండానే వైసీపీకి మొత్తం రాయలసీమలో ఏడు సీట్లు వచ్చాయంటే నగుబాటే అని అంటున్నారు.
By: Tupaki Desk | 30 May 2025 8:00 AM ISTఇంటికి వచ్చా నట్టింటికి వచ్చా అని ఒక పాపులర్ సినిమా డైలాగ్ తెలుగులో ఉంది. అలా వైసీపీ నట్టింటికి మరీ ప్రత్యర్ధి చేసిన గర్జనలు నిజంగానే పొలిటికల్ గా రీసౌండ్ చేశాయి. వైసీపీతో ఢీ కొట్టడం కష్టమని కూటమిని కట్టి టీడీపీ 2024 ఎన్నికలను ఎదుర్కొంది అది ఆనాటి రాజకీయ సన్నివేశం.
ఇపుడు చూస్తే ఏడాదిలో మొత్తం అంతా మారింది అన్నది టీడీపీ పెద్దల భావనగా ఉంది. అందుకే కడపలో ఏకంగా మహానాడు పెట్టి పార్టీ పండుగను అంగరంగ వైభవంగా జరిపారు. అంతే కాదు వైసీపీ ఎక్కడ ఉంది అని చంద్రబాబుతో పాటు అంతా ప్రశ్నించడం విశేషం. ఒక్క కడపలోనే టీడీపీ కూటమికి ఏడు అసెంబ్లీ సీట్లు వచ్చాయని రాయలసీమ మొత్తం మీద వైసీపీకి ఏడు సీట్లు వచ్చాయని చంద్రబాబు తన ముగింపు ఉపన్యాసంతో పొలిక తెస్తూ ఫ్యాన్ రెక్కలు ఊడాయని అన్నారు.
వైసీపీ పని అయిపోయింది అని కూడా అన్నారు. క్యాడర్ అంతా కలసికట్టుగా ఉంటే వైసీపీ అడ్రస్ కూడా దొరకదని ఆయన గంభీరంగా చెప్పుకొచ్చారు. వైసీపీ సోదిలో కూడా లేదన్నది మహానాడులో టీడీపీ నాయకుల నుంచి మంత్రుల దాకా అంతా అంటున్న మాట.
ఇలా ఎందుకు అంతా అన్నారంటే వైసీపీకి మొదటి నుంచి రాయలసీమనే అన్ని రకాలుగా ఆదుకుంటూ వచ్చింది. 2014లో మెజారిటీ అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. 2019లో చూస్తే కేవలం మూడు సీట్లు తప్ప మిగిలిన 49 సీట్లూ వైసీపీ పరం అయ్యాయి కర్నూల్, కడపలలో అయితే స్వీప్ చేసి పారేసింది వైసీపీ.
అలాంటిది గిర్రున అయిదేళ్ళు తిరగకుండానే వైసీపీకి మొత్తం రాయలసీమలో ఏడు సీట్లు వచ్చాయంటే నగుబాటే అని అంటున్నారు. దానికి కారణం ఏమిటో వైసీపీ వారికి అర్థం కాకపోయినా చంద్రబాబు చెప్పుకొచ్చారు, అహంకారానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారని అన్నరు. ఇక వైసీపీకి మళ్ళీ గెలిచే రోజులు లేవని ధీమా వ్యక్తం చేశారు. కడపలో పదికి పది సీట్లూ ఈసారి గెలుచుకుందామని అన్నారు. అంటే జగన్ పులివెందుల సీటు కూడా తమదే అని టీడీపీ చాలా విశ్వాసం వ్యక్తం చేస్తోంది అన్న మాట.
ఇలా కడపలో నిర్వహిచిన మహానాడు టీడీపీకి అతి పెద్ద బూస్టింగ్ ఇచ్చింది అని అంటున్నారు. ఇక చంద్రబాబు తమ ప్రసంగంలో రాయలసీమ డిక్లరేషన్ ని ప్రకటించారు. రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా అన్నారు. రాయలసీమ విషయంలో రెండవ మాట లేదని చెప్పారు. తాను మొదటి నుంచి సీమ పక్షపాతిని అని ఆయన చెప్పుకున్నారు. రాయలసీమలో తాగు నీరు సాగునీరుతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేస్తామని అన్నారు.
మొత్తానికి కడపలో టీడీపీ మీటింగ్ ఎందుకు అన్న చర్చ అయితే మొదట్లో వచ్చింది. దానికి మూడు రోజుల మహానాడు గట్టి బదులు ఇచ్చింది అని అంటున్నారు వైసీపీకి ఏ మాత్రం రాజకీయ బలం ఉన్నట్లుగా అనిపించినా దాని పునాదుల మీదనే దెబ్బ పడేలా 140 ఎకరలా సువిశాల స్థలంలో టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ పసుపు పార్టీలో పరవశాన్ని కలుగచేసింది. అదే సమయంలో ఇంతటి పసుపుదనంలో వైసీపీ అడ్రస్ ఎక్కడో వెతుక్కోమని టీడీపీ గట్టి సవాల్ నే విసిరింది. మరి దీనికి ధీటైన సమాధానం వైసీపీ వైపు నుంచి ఇప్పట్లో ఉంటుందా అన్నదే ప్రశ్న.
