Begin typing your search above and press return to search.

మహానాడుకు.. మహా వైభవం!

అదేవిధంగా స్థానిక సమస్యల మీద, పార్టీ భవిష్యత్తుపై కూడా తీర్మానాలు చేశారు. ఇక కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహానాడు మరింత వైభవంగా సాగింది.

By:  Garuda Media   |   29 May 2026 1:48 AM IST
మహానాడుకు.. మహా వైభవం!
X

తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు ఈసారి ఆన్లైన్ వేదికగా జరిగింది. అయినప్పటికీ దాదాపు నాలుగు లక్షల మందికి పైగా ఈ మహానాడులో కీలక పాత్ర పోషించారు. ఆన్లైన్లో నిర్వహించినప్పటికీ ఎక్కడికి అక్కడ క్లస్టర్ల వారిగా నాయకులు పాల్గొన్నారు. మహానాడును మహా వైభవంగా నిర్వహించేందుకు చాలా కృషి చేశారనే చెప్పాలి. ఈ ఫలితం తొలిరోజు మహానాడు కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపించింది. ఎక్కడికక్కడ భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను తరలించారు.

అదేవిధంగా స్థానిక సమస్యల మీద, పార్టీ భవిష్యత్తుపై కూడా తీర్మానాలు చేశారు. ఇక కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహానాడు మరింత వైభవంగా సాగింది. పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నుంచి పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వరకు చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఇక ఈ క్రమంలో మహానాడు తొలిరోజు కొన్ని మంచి విషయాలు స్పష్టం అయ్యాయి. పార్టీ కార్యకర్తలకే కాదు నాయకులకు కూడా అనేక విషయాలు బోధపడ్డాయి. పైకి చెప్పిన విషయాలు కొన్ని అయితే.. చెప్పకుండా చేసిన విషయాలు మరికొన్ని ఈ మహానాడు వేదికగా సుస్పష్టం అయ్యాయి.

వీటిలో ప్రధానంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సూత్రాన్ని నారా లోకేష్ చేసి చూపించారు. వేదికపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు దగ్గరికి వెళ్లి కింద కూర్చుని ఆయన సంభాషించిన విషయం నేటి తరం కార్యకర్తలకు ఒక పాఠమేన‌ని చెప్పాలి. తద్వారా సీనియర్లను గౌరవించాలన్న ప్రాథమిక సూత్రాన్ని లోకేష్ ఆచరించి చూపించారు. అదేవిధంగా ఎక్కువ మంది కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఈ మహానాడులో లభించింది.

వాస్తవానికి మహానాడు అనగానే సీనియర్ నాయకులు వస్తారు. గతాన్ని ప్రస్తుతాన్ని భవిష్యత్తును చెప్పి వేదికలు దిగుతారు. కానీ ఈసారి వినూత్నంగా మహానాడు వేదికపై పార్టీ కార్యకర్తలకు అవకాశం కల్పించారు. పార్టీలో ఇకనుంచి యువ నాయకత్వానికి ముఖ్యంగా కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్య ఇస్తున్నామన్న సంకేతాలను పంపించారు. ఇది పార్టీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అదే విధంగా పార్టీలో యువనాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఒక స్పష్టతను ఇచ్చినట్టు అయింది.

మరో కీలక విషయం.. భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలతో పాటు కూటమి పార్టీల ఆవశ్యకతను కూడా మహానాడు వేదిక స్పష్టం చేసింది. ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్న సంగతులు కలివిడిగా ఉండికూటమిగా పోటీ చేసినప్పుడు సాధించిన విజయాలను ఈ మహానాడు వివరించింది. తద్వారా పార్టీలో నాయకుల మధ్య కలివిడి ఎంత ముఖ్యమో అదే విధంగా కూటమిలో నాయకుల మధ్య కూడా కలివిడి అంతే ముఖ్యమన్న భావనను స్పష్టం చేసింది.

మొత్తంగా ఈ మహానాడు అనేక విషయాలకు అద్దం పట్టిందని చెప్పాలి. దీని నుంచి నేటి తరం నాయకు లు నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. వాటిపై అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు తరం పార్టీకి మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.