Begin typing your search above and press return to search.

మహానాడు సిక్కోలు కాదా...మరెక్కడ ?

తెలుగుదేశం పార్టీ పండుగగా మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మహానాడు ఎపుడూ సందడిగానే ఉంటుంది.

By:  Satya P   |   30 April 2026 4:00 PM IST
మహానాడు సిక్కోలు కాదా...మరెక్కడ ?
X

తెలుగుదేశం పార్టీ పండుగగా మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మహానాడు ఎపుడూ సందడిగానే ఉంటుంది. పార్టీ మొత్తం హాజరయ్యే ఈ పసుపు శిబిరం వేడుక రాష్ట్ర రాజకీయాల్లో ఎపుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మారుతోంది అని ప్రచారం సాగుతోంది. ముందు అనుకున్న దాని ప్రకారం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహిస్తారు అని అంటూ వచ్చారు. కానీ ఇపుడు ఇక్కడ కాదు అన్నది అంటున్నారు. మరి మహానాడు ఎక్కడ జరుపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఉత్తరాంధ్ర నుంచి :

తెలుగుదేశం పార్టీ అంటే భిన్నమైన విధంగా సాగుతుంది. అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను కలుపుకుని ముందుకు సాగుతూ వస్తుంది. పార్టీలో ఎలా సామాజిక న్యాయం ప్రాంతీయ న్యాయం పాటిస్తారో అలాగే తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుని కూడా ప్రతీ ఏడాది ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మహానాడుకు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో విపక్షంలో ఉన్నపుడు నిర్వహించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత 2025 లో కడపలో మహానాడుని నిర్వహించి రీ సౌండ్ చేశారు. ఇక ఈసారి ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం నడిబొడ్డున నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. ఆ మేరకు సరైన స్థలం ఏమిటి అన్నది పార్టీకి చెందిన కీలక నేతలు అంతా శ్రీకాకుళంలో అన్వేషిస్తూ ఉన్నారు.

సడెన్ చేంజ్ అంటూ :

అయితే మహానాడు వేదిక మారుతోంది అని తాజాగా వినిపిస్తున్న మాట. ఉత్తరాంధ్రాలో కాకుండా నెల్లూరులో ఈసారి మహానాడు నిర్వహించాలని పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అధికారికంగా ఈ విషయం ప్రకటించకపోయినా పార్టీ అనేక రకాలుగా ఆలోచించి ఈ డెసిషన్ కి వచ్చిందని త్వరలో దీని మీద అధికార ప్రకటన ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఈ వేదిక ప్రాంతం మార్పునకు కారణం ఏమిటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలలో ఉత్తరాంధ్రా వస్తున్నారు. ఆయన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. అదే జరిగితే ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖలను కలుపుతూ అతి పెద్ద సభను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంతో అంతకంటే ముందు శ్రీకాకుళంలో ఈ సభ నిర్వహించడం అంటే వ్యయ ప్రయాసలు అవుతాయని పైగా దాదాపుగా అతి తక్కువ సమయంలో రెండు మీటింగ్స్ అన్నది కూడా ఉంటుందని ఆలోచించి ఇపుడు వేదిక మార్పు చేశారు అని అంటున్నారు.

నెల్లూరులో కీలకంగా :

ఇక నెల్లూరు టీడీపీకి ఇపుడు అత్యంత కీలకంగా ఉంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ మొత్తం అన్ని స్థానాలను గెలుచుకుని స్వీప్ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా బలాన్ని పెంచుకుంది. అంతకు ముందు అయితే కాంగ్రెస్ తరువాత వైసీపీ ఈ జిల్లాలో బలంగా ఉంటూ వచ్చేవి. కానీ ఇపుడు మాత్రం టీడీపీ జెండా ఎగురుతోంది. అంతే కాదు ఎంతో బలమైన నేతలు ఈ జిల్లాలో ఉన్నారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు గడ్డ మీద ఈసారి మహానాడుని నిర్వహించాలని చూస్తోంది అని అంటున్నారు. మరి ఈ ప్రచారం మీద పార్టీ అధికారిక ప్రకటన చేస్తుందని అంతా చూస్తున్నారు.