Begin typing your search above and press return to search.

డిప్యూటీ స్పీకర్ రఘురామకు షాక్.. టీడీపీ నేత తిరుగుబాటు

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సొంత నియోజకవర్గం ఉండికి చెందిన టీడీపీ సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆరోపించారు

By:  Tupaki Desk   |   17 Feb 2026 1:26 PM IST
డిప్యూటీ స్పీకర్ రఘురామకు షాక్.. టీడీపీ నేత తిరుగుబాటు
X

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకు సొంత నియోజకవర్గం నుంచి సెగ మొదలైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సొంత నియోజకవర్గం ఉండికి చెందిన టీడీపీ సీనియర్ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఆరోపించారు. రఘురామపై తీవ్ర ఆరోపణలు చేసిన పొత్తూరి వెంకటేశ్వరరాజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ నుంచి తనను రక్షించాలని వేడుకున్నాడు. అధికార పార్టీలో పొత్తూరి ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, పార్టీ నేత నుంచి డిప్యూటీ స్పీకర్ ఆరోపణలు ఎదుర్కోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యేగా రఘురామరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీలో ప్రముఖ నేతగా ఉన్న ఆయనపై సొంత పార్టీ నేతే ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేగా రఘురామరాజు అరాచక పాలన సాగిస్తున్నారంటూ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఆయన నుంచి ప్రాణ హాని ఉందని, చంపుతానని బెదిరిస్తున్నాడని మీడియా ముఖంగా ప్రకటించడం హీట్ పుట్టిస్తోంది. టీడీపీ నేత పొత్తూరి ఆరోపణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రఘురామపై ఆరోపణలు చేసిన పొత్తూరి వెంకటేశ్వరరాజు స్వగ్రామం ఉండి మండలంలోని వెలిపర్రు. తొలి నుంచి టీడీపీలో ఉన్న ఆయన రఘురామ వైఖరితో విసిగిపోయినట్లు చెబుతున్నారు. రఘురామ కారణంగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు దూరమవుతున్నారని, ఈ విషయంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కలగ జేసుకోవాలని కోరుతున్నాడు. నియోజకవర్గంలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం రఘురామ రాజు పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని పొత్తూరి మండిపడ్డారు. అంతేకాకుండా రఘురామ దోపిడీ, దౌర్జన్యాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని బయటపెడతానని చెప్పడం సంచలనంగా మారింది.

ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి వరుస విజయాలు సాధిస్తున్న ఈ స్థానంలో విభేదాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఈ తరహా వాతావరణం లేదని అంటున్నారు. కానీ తొలిసారిగా ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడిందనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన రఘురామకు టీడీపీ కేడర్, నాయకులతో సరైన సంబంధాలు లేవా? 20 నెలలు గడిచినా ఆయన కేడర్ ను మచ్చిక చేసుకోలేకపోవడానికి కారణాలేంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ నిత్యం అసమ్మతి స్వరాలు వినిపించిన రఘురామ ఇప్పుడు రివర్స్ లో అదే పరిస్థితి ఎదుర్కోవడంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోందని అంటున్నారు.