Begin typing your search above and press return to search.

వీధిన ప‌డ్డ త‌మ్ముళ్లు.. అస‌లేమ‌నుకుంటున్నారు?

ఈ క్ర‌మంలో గ‌త రెండు మూడు మాసాలుగా ఎమ్మెల్యేకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ వ్య‌వ‌హారంపై విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి.

By:  Garuda Media   |   27 May 2026 6:00 AM IST
వీధిన ప‌డ్డ త‌మ్ముళ్లు.. అస‌లేమ‌నుకుంటున్నారు?
X

అధికార టీడీపీ కూట‌మిని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమంపై అవ‌గాహ‌న క‌ల్పిం చాల‌ని సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే నాయ‌కుల‌కు చెబుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఆయ‌న మీటింగులు పెడుతున్నారు. ఏప్రాంతానికి వెళ్లినా.. అక్క‌డి నాయ‌కుల‌తో ఇదే విష‌యాన్ని చ‌ర్చిస్తున్నా రు. అయినా.. మార్పు పెద్ద‌గా క‌నిపించడం లేదు. ``మీ దారి మీదే.. మాదారి మాదే`` అన్న‌ట్టుగా సీనియ‌ర్ నాయ‌కులే రోడ్డున పడుతున్నారు.

తాజాగా ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ సీనియ‌ర్ నాయకులు.. వారి అనుచ‌రులు.. రోడ్డు న పడ్డారు. ప్ర‌స్తుతం ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్న సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు.. వ‌ర‌ద‌రాజులు రెడ్డి మెయిన్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్ క‌ట్టుకున్నారు. వాస్త‌వానికి ఇది.. వైసీపీ హ‌యాంలోనే జ‌రిగింది. కానీ.. తాజాగా దీనిపై సొంత పార్టీలోనే ఆయ‌న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. దీనిని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించార‌ని పేర్కొంటూ.. నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఇంచార్జ్‌, టీడీపీ సీనియ‌ర్ నేత ప్ర‌వీణ్ చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో గ‌త రెండు మూడు మాసాలుగా ఎమ్మెల్యేకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ వ్య‌వ‌హారంపై విమ‌ర్శ లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. తాజాగా.. ఈ వ్య‌వ‌హారంపై.. ప్ర‌వీణ్‌(ఈయ‌న కూడా టీడీపీ నేతే) ప‌ట్ట‌ణ ప్లానింగ్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. స‌ద‌రు షాపింగ్ కాంప్లెక్స్‌ను కూల్చి వేయాల‌ని పేర్కొంటూ .. ఫిర్యాదు అందించారు. దీంతో అధికారులు అస‌లు ఈ విష‌యంపై దృష్టి పెట్టారో లేదో తెలియదు కానీ.. టేపులు.. స్కేళ్లు ప‌ట్టుకుని కొల‌త‌లు వేసేందుకు వ‌చ్చేశారు.

దీంతో ర‌గిలిపోయిన ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజులు రెడ్డి.. త‌న అనుచ‌రుల‌ను పురిగొల్పార‌ని స్థానికులు చెబుతు న్నారు. దీనికి ప్ర‌తిగా ప్ర‌వీణ్ వ‌ర్గం నుంచి కూడా వంద‌ల మంది యువ‌కులు వ‌చ్చారు. ఇరు వ‌ర్గాలు రోడ్డున ప‌డి రాళ్లు రువ్వుకున్నాయి. ఈ విష‌యం తెలిసి.. రంగంలోకి దిగిన పోలీసులు కూడా.. ఈ రాళ్ల వ‌ర్షానికి భ‌య‌ప‌డి.. త‌ల‌కో దిక్కు పారిపోయారు. కొద్దిసేపు ఈ రాళ్ల వ‌ర్షం కొనసాగింది. అనంత‌రం.. పోలీసులు లాటీ చార్జీ చేసి.. చెద‌ర గొట్టారు. కానీ, ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. సొంత పార్టీ నాయ‌కులే.. ఇలా రోడ్డున పడికొట్టుకుంటే.. పార్టీ ప‌రువు ఏం గాన‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనిపై చంద్ర‌బాబు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో.. లేక‌.. `సీరియ‌స్‌` అయ్యార‌ని ప్ర‌క‌టించి వ‌దిలేస్తారో చూడాలి.