Begin typing your search above and press return to search.

బాబు ఈ మ్యాట‌ర్ సెట్ చేయ‌క‌పోతే ఇబ్బందే...?

పార్టీ నాయ‌కుల‌తో పాటు.. ఎమ్మెల్యేల‌కు కూడా చిక్కులు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి మండల స్థాయి వ‌ర‌కు కూడా.. ప్ర‌జ‌ల నుంచి కొంత సెగ త‌గులుతోంది.

By:  Garuda Media   |   25 Feb 2026 5:00 AM IST
బాబు ఈ మ్యాట‌ర్ సెట్ చేయ‌క‌పోతే ఇబ్బందే...?
X

పార్టీ నాయ‌కుల‌తో పాటు.. ఎమ్మెల్యేల‌కు కూడా చిక్కులు వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి మండల స్థాయి వ‌ర‌కు కూడా.. ప్ర‌జ‌ల నుంచి కొంత సెగ త‌గులుతోంది. ఈ స‌మ‌స్య ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికో ప‌రిమితం కాలేదు.. దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఉంద‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు .. వైసీపీ పాల‌న‌లో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను అనేక మంది అన‌ర్హుల‌కు రాశారు. దీంతో వారు పింఛ‌న్లు పొందుతున్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో టీడీపీ అనుకూల కుటుంబాల‌కు గుంటూరు స‌హా ప‌లు జిల్లాల్లో తొల‌గించారు.

ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే టీడీపీ నాయ‌కులు వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. కానీ, ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ఎవ‌రైతే.. పింఛ‌న్ల‌ను పోగొట్టుకున్నారో.. ఎవ‌రైతో నిజ‌మైన అర్హులు ఉన్నారో.. వారంద‌రికీ తాము అధికారంలోకి రాగానే పింఛ‌న్లు ఇస్తామ‌ని నాయ‌కులు హామీ ఇచ్చారు. అయితే.. 20 నెల‌లైనా కూడా.. ఈ హామీల‌ను నెర‌వేర్చ‌లేక పోయారు. కానీ.. అర్హుల నుంచి పెద్ద ఎత్తున పిటిష‌న్లు తీసుకున్నారు. వారి వివ‌రాల‌ను కూడా క‌న్ఫ‌ర్మ్ చేసుకున్నారు.

గుంటూరు, విజ‌య‌వాడ‌, ఉభ‌య గోదావ‌రి, విశాఖ‌, క‌ర్నూలు, అనంత‌పురం వంటి జిల్లాల్లో స‌ద‌రం టెస్టులు కూడా పూర్తి చేశారు. అన్నీ అయిన త‌ర్వాత‌.. ఎమ్మెల్యేలు సిఫార‌సు లేఖ‌లు కూడా జోడించి.. ఆయా జిల్లాల్లో పింఛ‌నుకు నిజ‌మైన‌ ల‌బ్ధిదారుల‌కు పింఛ‌ను అందించాల‌ని కోరుతూ.. క‌లెక్ట‌ర్ల‌కు అందించారు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా చ‌ర్య‌లు తీసుకోలేదు. గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మెల్యేల స‌మావేశంలో ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రిగిన‌ప్పుడు.. అన‌ర్హుల‌ను తొల‌గించి .. అర్హుల‌కు ఇస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

దీంతో ఎమ్మెల్యేలు త‌ర‌చుగా ఈ విష‌యాన్ని ల‌బ్ధి దారుల‌కు చెబుతున్నారు. త్వ‌ర‌లోనే మీకు పింఛ‌న్లు అందుతాయ‌ని కూడా హామీ ఇచ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు అవి సాకారం కాలేదు. వీరిలో వితంతు పింఛన్లు, దివ్యాంగ పింఛ‌న్లు ఎక్కువ‌గా ఉన్నాయి. అదేవిధంగా ఒంట‌రి మ‌హిళ‌లు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు అనర్హుల‌ను ఏరేసే కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌క‌పోవ‌డం.. కొన్ని జిల్లాల్లో చేప‌ట్టినా.. మ‌ళ్లీవెన‌క్కి త‌గ్గ‌డంతో కొత్త‌వారికి అవ‌కాశం ల‌భించ‌డం లేదు. ఈ విష‌య‌మే ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిగా మారింది. దీనిపై దృష్టి పెట్టాల‌ని వారు సీఎం ను కోరుతున్నారు.