Begin typing your search above and press return to search.

టీడీపీ 'క్ర‌మ‌శిక్ష‌ణ‌': నాన్నా పులి...!!

''బాబు గారు అన్నీ ప‌సిగ‌డ‌తారు.. జాగ్ర‌త్త‌. స‌ర్వేల రూపంలో అన్నీ తెలుసుకుంటారు. తేడా వ‌స్తే.. టికెట్ రాదు.''- 1990- 2004 మ‌ధ్య టీడీపీలో పెద్ద ఎత్తున వినిపించిన వ్యాఖ్య‌లు ఇవి.

By:  Garuda Media   |   4 April 2026 7:00 PM IST
టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌: నాన్నా పులి...!!
X

''అన్న‌గారికి తెలిస్తే.. ఇంకేమైనా ఉందా?'' - 1980-90ల మ‌ధ్య టీడీపీలో వినిపించిన మాట‌. పార్టీ గీత దాటేందుకు.. నాయ‌కులు హ‌డ‌లిపోయే రోజులు అవి!. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ ముందు త‌ప్పు చేసిన వారు నిల‌బ‌డేందుకు కూడా జంకే రోజులు!!.

''బాబు గారు అన్నీ ప‌సిగ‌డ‌తారు.. జాగ్ర‌త్త‌. స‌ర్వేల రూపంలో అన్నీ తెలుసుకుంటారు. తేడా వ‌స్తే.. టికెట్ రాదు.''- 1990- 2004 మ‌ధ్య టీడీపీలో పెద్ద ఎత్తున వినిపించిన వ్యాఖ్య‌లు ఇవి. పార్టీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు అన్నీ తెలుసుకుంటున్నార‌ని. త‌ప్పులు చేసిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని నాయ‌కులు హ‌డ‌లిపోయే రోజులు!.

''బాబుగారికి తెలిసినా ఏం కాదు. చిన్న వార్నింగ్ ఇచ్చి వ‌దిలేస్తారు.''- 2014-19 మ‌ధ్య వినిపించిన కామెంటు ఇది. అందుకే.. 2019లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ త‌ప్పులు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతూనే.. ఉదాశీనంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న గుర‌జాల‌లో మాట్లాడుతూ.. ''మీకు నేను ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. మా వాళ్లు త‌ప్పులు చేశారు. ఈ ఒక్క‌సారికి చూడండి. న‌న్ను చూసి ఓటేయండి'' అని వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టారు. అయినా.. ప్ర‌జ‌లు క‌రుణించ‌లేదు.

క‌ట్ చేస్తే..

''పార్టీలో ఏం చేసిన అడుగుతారు.. అంతే. వాళ్ల‌ని ఏం చేశారు. వీళ్ల‌ని ఏమ‌న్నారు. మ‌న‌మూ అంతే! ఏం కాదు. అంతా ప్ర‌చార‌మే. పైకి అలా అంటారు. ఏమీ చేయ‌రు.'' - గ‌త 20 మాసాల్లో అత్యంత బ‌లంగా టీడీపీలో వినిపిస్తున్న మాట ఇది. దీనిని వ్య‌తిరేక‌శ‌క్తులు , పార్టీ అంటే ఇష్టం లేని వారి పుట్టించార‌ని అనుకుంటే.. దానిక‌న్నా.. దౌర్భాగ్యం లేదు. వాస్త‌వం ఇదే. అందుకే.. విచ్చ‌ల‌విడి త‌నం పెరిగిపోయింది. ఎంత‌గా అంటే.. ఏ వైసీపీని.. ఆ పార్టీ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు తిట్టిపోస్తున్నారో.. అదే నేత‌ల‌తో టీడీపీ నేత‌లు మిలాఖ‌త్ అయిపోయారు.

వ్యాపారాలు చేసుకుంటూ.. క‌మీష‌న్లు దండుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇలా.. ఒక‌టి కాదు రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా త‌మ్ముళ్లు.. ఏనాడో దారి త‌ప్పారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు '' నివేదిక‌లు.. విచార‌ణ‌లు.. క్ర‌మ‌శిక్ష‌ణ సంఘాలు'' అంటూ.. త‌న‌కు తానే గంత‌లు క‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అంతిమంగా ఇది .. పార్టీకి ఎంత చేటు తెస్తుంద‌న్న‌ది ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలిసినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌దు. సో.. ఇప్ప‌టి నుంచైనా క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుని.. ఒక‌రిద్ద‌రికి బ‌లంగా పాఠం చెప్ప‌క‌పోతే.. నాన్నాపులి చందంగానే పార్టీ ప‌రిస్థితి మారే దుస్థితి ఏర్ప‌డుతుందని అంటున్నారు.