పిఠాపురం వర్మకు బాబు మార్క్ కౌంటర్
ఫ్లెక్సీల దగ్గర ఫోటోల దగ్గర కుర్చీల దగ్గర చిన్న పాటి కలహాలు రాకుండా చూసుకోవాలని బాబు హెచ్చరించారు. ఇది అంతా గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
By: Satya P | 29 April 2026 4:44 PM ISTతెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ అనుభవం ఎంతో గొప్పది. ఆయన క్షేత్ర స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎవరు ఎలా ఉంటారు ఏ విధంగా వ్యవహరిస్తారు, మాట వెనకాల ఏమి ఉంటుంది అన్నీ బాబుకు ఎరుకే. అందుకే ఆయన పదే పదే పార్టీ నేతలకు క్లాస్ తీసుకుంటూంటారు. తప్పు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తూంటారు. నర్మగర్భ వ్యాఖలు చేస్తూ తామే గొప్ప అని ఫీల్ అయ్యే వారికి ఇగోలతో మాట్లాడేవారికి కూడా బాబు గుర్తించి తనదైన మార్క్ కౌంటర్లు వేస్తారు. ఇపుడు పిఠాపురం వర్మకు అదే జరిగిందా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఫ్లెక్సీల దగ్గర అంటూ :
ఫ్లెక్సీల దగ్గర ఫోటోల దగ్గర కుర్చీల దగ్గర చిన్న పాటి కలహాలు రాకుండా చూసుకోవాలని బాబు హెచ్చరించారు. ఇది అంతా గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తాను చాలా సార్లు ఇలాంటివి చూస్తున్నాను అని అన్నారు. అందుకే చెబుతున్నాను అని బాబు స్పష్టం చేశారు. తాను ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను అని ఆయన అన్నారు. ఎవరైనా అధికారం ఉందని ఇగో ప్రదర్శిస్తే నష్టపోయేది మీరే అంటూ బాబు ఇవ్వాల్సినవి ఇచ్చేశారు, చెప్పాల్సినవి చెప్పేశారు.
బాధ్యత ఇచ్చామంటే :
తెలుగుదేశం పార్టీలో తాను ఎన్నో కమిటీలు ఎన్నో దశాబ్దాలుగా వేస్తూ వస్తున్నామని బాబు గుర్తు చేశారు. ఎపుడూ కూడా కష్టపడి పనిచేసేవారికే పెద్ద పీట వేశామని అన్నారు. ఈసారి చూస్తే కనుక ఒక వైపు అనుభవంతో పాటు కొత్త వారికి కూడా కలిపి సమతూకం పాటించామని బాబు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా సమగ్రంగా పరిశీలించి ఎంపిక చేశామని చెప్పారు.
గుడ్డిగా అవకాశాలు ఇవ్వం :
పార్టీ కోసం పనిచేస్తారని భావించి అన్నీ చూసే అవకాశాలు ఇస్తామని చెప్పారు. ఎవరినీ గుడ్డినా నమ్మి బాధ్యతలు ఇచ్చేది ఉండదని బాబు స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలోనే అందరికీ పార్టీ పరంగా అందలాలు అందిస్తున్నామని అన్నారు. ఒక కార్యకర్త పార్టీ అధినేత అన్నది నినాదం కాదు టీడీపీ విధానం అని చెప్పడానికి పార్టీ కమిటీలలో ఇచ్చిన అవకాశాలే ఉదాహరణ అని బాబు అన్నారు. ఒక మండల పార్టీ అధ్యక్షురాలికి ఒక క్లస్టర్ ఇంచార్జికి పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించామంటే అది టీడీపీ నాయకత్వం చిత్తశుద్ధి అని బాబు చెప్పారు. చదువుకున్న వారికి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కూడా ముఖ్య పాత్ర లభించేలా చూశామని అన్నారు. మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడమే మహిళకు టీడీపీ అన్ని విధాలుగా పెద్ద పీట వేసిందని ఆయన గుర్తు చేశారు.
లోకేష్ కి ప్రశంస :
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు నారా లోకేష్ పోషించిన పాత్ర ఎంతో కీలకంగా మారిందని చంద్రబాబు కొనియాడారు. కార్యకర్తల శిక్షణ నుంచి పార్టీని సమర్ధంగా నడిపించిన తీరుతో లోకేష్ ముందుకు సాగారని అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో లోకేష్ పనిచేస్తున్నారు అని బాబు గుర్తు చేశారు.
పోలింగ్ బూత్ ల నుంచి :
ఇక టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన దాని కంటే మరింతగా ఓట్లు పెరగాలని బాబు సూచించారు ప్రతీ పోలింగ్ బూత్ లోనూ గతంలో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ తీసుకుని వచ్చేందుకు కార్యకర్తల నుంచి అంతా కృషి చేయాలని అన్నారు. కార్యకర్తలు గత అయిదళ్ళ వైసీపీ పాలనలో పడిన కష్టాలు అన్నీ తనకు గుర్తున్నాయని బాబు చెబుతూ వారి శ్రమ ఫలితమే టీడీపీకి అధికారం అని బాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని గట్టిగా పనిచేయాలని బాబు కోరారు.
విపక్షం కుట్రలు :
రాష్ట్రం అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉందని ఆర్ధికంగా సంక్షోభంలో ఉందని అయినా ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని బాబు చెప్పారు. అదే విధంగా సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేస్తున్నామని అన్నారు రాష్ట్రాన్ని పునర్ నిర్మించే పనిలో ప్రభుత్వం ఉంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని వైసీపీ మీద చంద్రబాబు నిప్పులు చెరిగారు. వారు చేసే ఫేక్ ప్రచారాలకు కాలం చెల్లిందని అంటూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా కఠినమైన తీరులోనే క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు హెచ్చరికలూ జారీ చేశారు.
