Begin typing your search above and press return to search.

విశాఖ వేదికగా కూటమి రీ సౌండ్ !

ఏపీలో టీడీపీ కూటమి రెండేళ్ళ పాలన పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు.

By:  Satya P   |   16 Jun 2026 9:20 AM IST
విశాఖ వేదికగా కూటమి రీ సౌండ్ !
X

ఏపీలో టీడీపీ కూటమి రెండేళ్ళ పాలన పూర్తి అయిన సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి సభను రాయలసీమ రీజియన్ లో నిర్వహించారు. అది బ్రహ్మాండమైన తీరులో సక్సెస్ అయింది అని కూటమి నేతలు అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో విశాఖలో రెండవ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారాంతంలో విశాఖలో పెద్ద ఎత్తున సభను నిర్వహించి ఉత్తరాంధ్రాలో కూటమి సక్సెస్ మీద రీసౌండ్ చేయాలని భావిస్తున్నారు.

కేంద్ర మంత్రులతో సహా :

ఈసారి విశాఖలో నిర్వహించే సభకు కేంద్ర మంత్రులు పలువురు హాజరవుతారని అంటున్నారు. అలాగే ఏపీలోని కీలక మంత్రులు అంతా ఈ సభకు వస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ రామ్మోహన్ నాయుడు సహా అంతా ప్రసంగించబోతున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనకు 12 ఏళ్ళు పూర్తి కావడంతో ఆ సంబరాలను అలాగే ఏపీలో కూటమి రెండేళ్ళ విజయోత్సవాలను కలిపి నిర్వహిస్తామని చెబుతున్నారు.

సన్నాహాల జోరు :

ఈ నెల 19న విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించే ఈ సభకు ఏర్పాట్లు జోరుగా చేస్తున్నారు. వేలాదిగా ప్రజానీకం ఈ సభకు హాజరవుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రాలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా కూటమి నేతలు తెలియ చేస్తారని అంటున్నారు. రెండేళ్ళలో పెద్ద ఎత్తున పరిశ్రమలు విశాఖ సహా మూడు జిల్లాలకు వచ్చిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు.

పట్టు బిగించేందుకే :

కూటమికి ఉత్తరాంధ్రాలో ఇప్పటికే రాజకీయంగా మంచి పట్టు ఉంది. దానిని మరింతగా బిగించేందుకు ఈ విజయోత్సవ సభను ఉపయోగించుకుంటారని అంటున్నారు. రానున్న కాలంలో స్థానిక సంస్థలు జరగనున్నాయి. దాంతో ఆ ఎన్నికల కోసం కూడా ఈ తరహా సభని వినియోగించుకోవాలన్న ప్రణాళికతో కూటమి పెద్దలు ముందుకు సాగుతున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా ఉత్తరాంధ్ర కూటమికి జై కొట్టింది. ఏజేన్సీలో రెండు సీట్లు తప్ప మొత్తం అన్నీ కూటమి పార్టీలే గెలుచుకున్నాయి. ఇపుడు తాము అభివృద్ధి చేసి చూపిస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే ఈ నెల 19న జరిగే సభ అదిరిపోయే లెవెల్ లో ఉంటుందని కూటమి నాయకులు చెబుతున్నారు. తిరుపతి సభను మించేలా జరపాలని చూస్తున్న కూటమి నేతల ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే విశాఖ సభ చేసే రీ సౌండ్ పొలిటికల్ గా ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఈ సభలో చంద్రబాబు పవన్ లోకేష్ ఇచ్చే స్పీచ్ ల వేడి వాడి ఎలా ఉండబోతోందో.