Begin typing your search above and press return to search.

బాబు కోసం తారకరత్న పిల్లలు.. మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్?

ఈ పిల్లలు బాబుకు మద్దతునిస్తున్నారు. దీంతో మరోసారి నందమూరి వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషయం హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 6:41 AM GMT
బాబు కోసం తారకరత్న పిల్లలు.. మరి  ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్?
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు, రిమాండ్ను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఐ యామ్ విత్ బాబు అనే ఫ్లకార్టులు పట్టుకుని బాబుకు మద్దతుగా ప్రజలు నిలుస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు చంద్రబాబుకు మద్దతుగా ఫ్లకార్టులు పట్టుకున్న ఫొటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటో నందమూరి వారసుడు, దివంగత తారకరత్న పిల్లలది కావడమే అందుకు కారణం. ఈ పోరాటంలో మేమంతా మీ వెంటే, బాబుతో నేను అనే ఫ్లకార్డులు పట్టుకుని ఈ పిల్లలు బాబుకు మద్దతునిస్తున్నారు. దీంతో మరోసారి నందమూరి వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషయం హాట్ టాపిక్ గా మారింది.

చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంపై ఒక్కొక్కరిగా నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు. కానీ సోదరులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకూ రియాక్టు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నటనలో తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్.. భవిష్యత్ లో రాజకీయాల్లోకి వచ్చి తాత స్థాపించిన టీడీపీని నడిపిస్తారనే అంచనాలున్నాయి. అయినప్పటికీ బాబు అరెస్టును ఎన్టీఆర్ పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే విషయంపై అచ్చెన్నాయుడిని అడిగితే.. అది ఎన్టీఆర్ నే అడగాలని ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం. తాజాగా సైమా అవార్డులు కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తండ్రి, దివంగత హరిక్రిష్ణ టీడీపీ శ్వాసగా బతికారనే చెప్పాలి. మొదటి నుంచి తండ్రితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో హరిక్రిష్ణ కీలక పాత్ర పోషించేవాళ్లు. అలాంటిది హరిక్రిష్ణ తనయులుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇప్పుడు పార్టీకి ప్రధానమైన బాబు అరెస్టును పట్టించుకోక పోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే బాబు అవసరానికి ఉపయోగించుకుని వదిలేస్తారని, ఈ విషయం ఎన్టీఆర్ కు బాగా తెలుసన్నది మరో వర్గం వాదన. గతంలో ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. కానీ తన కొడుకు లోకేష్ కోసం ఎన్టీఆర్ ను బాబు పక్కనపెట్టారన్న ఆరోపణలున్నాయి. అందుకే అప్పటి నుంచి బాబును ఎన్టీఆర్ కూడా దూరం పెడుతున్నారని సమాచారం.