Begin typing your search above and press return to search.

లక్షన్నర కోట్ల ఉచితాలు.. 10 లక్షల కోట్ల అప్పులు.. తమిళనాడులో హామీల అమలు సాధ్యమేనా?

అధికారం నిలబెట్టుకోవడం కోసం డీఎంకే, పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఏఐడీఎంకే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న దళపతి విజయ్ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నారు

By:  Tupaki Desk   |   19 April 2026 6:00 AM IST
లక్షన్నర కోట్ల ఉచితాలు.. 10 లక్షల కోట్ల అప్పులు.. తమిళనాడులో హామీల అమలు సాధ్యమేనా?
X

తమిళనాడు ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం డీఎంకే, పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఏఐడీఎంకే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న దళపతి విజయ్ మరోవైపు ఢీ అంటే ఢీ అంటున్నారు. విజయమే లక్ష్యంగా ఉచిత పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్, ఆదాయ వ్యయాలకు సంబంధం లేకుండా మూడు పార్టీలు ఇస్తున్న హామీలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఆదాయవ్యయాల లెక్క ఇది..

దక్షిణాదిలో తమిళనాడు కీలక రాష్ట్రం. దాదాపు ఏడాదికి రూ.3.5 లక్షల కోట్ల ఆదాయం వస్తున్న ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యయమే ఎక్కువ. వస్తున్న ఆదాయం కన్నా సుమారు 40 వేల కోట్లు అధికంగా ఖర్చు అవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ఆదాయం రూ.3.44 లక్షల కోట్లు అయితే వ్యయం రూ.3.93 లక్షలుగా ఉంది. అంటే రెవెన్యూ లోటు దాదాపు రూ.40 వేల కోట్ల ఉండగా, మొత్తం ద్రవ్య లోటు రూ.1.22 లక్షల కోట్లు ఉంది. మరోవైపు తమిళనాడు మొత్తం అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయి. ఈ పరిస్థితుల్లో అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

రూ.1.5 లక్షల కోట్లు అవసరం

ఈ పరిస్థితుల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహణకే ప్రస్తుతం అప్పులు చేయాల్సివస్తోందని చెబుతున్నారు. ఇక తాజా ఎన్నికల్లో పార్టీలు పోటాపోటీగా ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే ఏడాదికి మరో లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఆదాయం పెరగకుండా అంత మొత్తం డబ్బు ఎక్కడి నుంచి సమీకరిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు అంటేనే ఉచితాలు, వాగ్దానాల ప్రవాహం ఉంటుంది. తమిళనాడులో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. గత 40 ఏళ్ల చరిత్రలో తమిళనాడు ప్రజలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనట్లు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికలకు సిద్ధమయ్యే పార్టీలు వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని హామీలు ఇస్తుంటాయని పరిశీలకులు చెబుతున్నారు.

భారంగా నగదు బదిలీ

ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న మూడు పక్షాలు భారీ హామీలు గుప్పించాయి. ఇందులో నగదు బదిలీపై అన్ని పార్టీలు వాగ్దానాలు చేశాయి. ఇక ఉచిత గ్యాస్, ల్యాప్ టాప్ల పంపిణీ, ఉచిత రిఫ్రిజిరేటర్లు, విద్యుత్ చార్జిల తగ్గింపు వంటి పథకాలు ఆర్థికంగా భారం మోపనున్నాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం తమిళనాడులో తలపడుతున్న పార్టీలు భవిష్యత్తులో ఆదాయం వచ్చే మార్గాలు ఏంటో చెప్పకుండా, భారీగా హామీలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందని, కొత్త పథకాల కోసం అప్పులు చేయడం లేదా పన్నులు పెంచడం మినహా మరో మార్గం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పుల శాతం ఇప్పటికే 26% పైగా ఉందని, వడ్డీల చెల్లింపులకే ఏడాదికి రూ.60,000 కోట్లకు పైగా ఖర్చు అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీలు ఇచ్చే హామీలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు.