తాడిపత్రిలో లొల్లి ఏంటి? ఎందుకంత కథ నడుస్తోంది?
రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిని చెబుతున్నారు.
By: Tupaki Desk | 14 Jun 2025 3:11 PM ISTఅనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందిన తాడిపత్రిలో అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఏడాది క్రితం ఎన్నికల ఫలితాలు విడుదల అయిన నుంచి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోయారు.
రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిని చెబుతున్నారు. ఈ మున్సిపాలిటీలో ప్రస్తుతం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండటంతో తాడిపత్రిలో ఏప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది.
గత ప్రభుత్వంలో తాడిపత్రిలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హవా నడవగా, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అధికారం చేతిలో ఉండటం, రాయలసీమ రాజకీయాల్లో జేసీ కుటుంబానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో తాడిపత్రి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఏడాదిగా నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా జేసీ పావులు కదుపుతుండటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇక ఏడాది తర్వాత తన సొంత ఇంటికి రావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్ణయించుకోవడం, ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకోడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమాచారం అందడంతోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ నివాసంతోపాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు.
ఇక, కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారంతో ఆయనను తిమ్మంపల్లి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. తనకు కోర్టు పర్మిషన్లు ఉన్నా, ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ కన్నుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో అడుగుపెట్టనీయమని జేసీ అనుచరులు భీష్మించుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ కనిపిస్తోంది.
