సాక్షి జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్
సీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By: Tupaki Desk | 13 Jun 2025 4:03 PM ISTసీనియర్ జర్నలిస్టు, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీలో జరిగిన చర్చ కార్యక్రమంలో అమరావతి మహిళా రైతులపై విజయవాడకు చెందిన మరో జర్నిలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అమరావతి మహిళా రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9న కొమ్మినేనికి హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును సవాల్ చేస్తూ కొమ్మినేని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, పోలీసుల వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం తీర్పుతో ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న సీనియర్ జర్నిలిస్టు కొమ్మినేని విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం అత్యావసర విచారణ జరిపింది. ‘‘గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు టీవీ యాంకర్ కొమ్మినేని ఎలా బాధ్యులతవుతారు? నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా? అలాగైతే కేసు విచారణ సమయంో చాలా సార్లు మేమూ నవ్వుతామంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వాక్ స్వాతంత్య్రాన్ని రక్షించాలని, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని వ్యాఖ్యానించిన కోర్టు నిందితుడు కొమ్మినేనిని తక్షణం విడుదల చేయాలని తీర్పునిచ్చింది.
కాగా, సుప్రీం తీర్పును వైసీపీ అధినేత జగన్ స్వాగతించారు. అంతేకాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు ఖండిస్తూ సుదీర్ఘ ట్వీట్ చేశారు.
‘‘సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకి పెద్ద చెంపపెట్టు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహం.
అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబుగారు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలననుంచి మళ్లించడానికి, తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసులమీద, కార్యాలయాలమీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.
చంద్రబాబుగారు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడ్డంతోనే ఆయన రాజకీయ లబ్ధికోసం ఈ కుట్రపన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడు వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేని గారికి ఏం సంబంధం అంటూ? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు’ అంటూ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
