బాలిక ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాల్సిన అవసరం లేదు - సుప్రీం కోర్ట్
గర్భం దాల్చినంత మాత్రాన ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తల్లిని చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 24 April 2026 4:18 PM ISTబాలిక గర్భం దాల్చినంత మాత్రాన ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా తల్లిని చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికల విషయంలో వారి మానసిక స్థితి, భవిష్యత్తు చాలా ముఖ్యమని కోర్టు అభిప్రాయపడింది. 'నా శరీరం-నా ఇష్టం' అనే హక్కు మహిళలకు ఉంటుందని, వారి స్వేచ్ఛను గౌరవించాలని చెబుతూ ఓ 15 ఏళ్ల బాలికకు గర్భస్రావం చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బాలికల ఇష్టమే ముఖ్యం:
ఒక ఆడపిల్ల గర్భం దాల్చినప్పుడు ఆమె ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా సమాజం లేదా చట్టం బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పింది. 15 ఏళ్ల వయసు అంటే అది ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు. అలాంటి సమయంలో ఇష్టం లేని గర్భం ఆ బాలికపై మోయలేని భారంగా మారుతుంది. అందుకే ఆమె మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ ప్రెగ్నెన్సీని తీసేయడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం ఒక కేసు తీర్పు మాత్రమే కాదు, బాలికల వ్యక్తిగత స్వేచ్ఛకు దక్కిన గౌరవం.
భవిష్యత్తుపై ప్రభావం పడకూడదు:
చిన్న వయసులో తల్లి కావడం వల్ల ఆ బాలిక ఎదుర్కోవాల్సిన సవాళ్లు చాలా దారుణంగా ఉంటాయి. శారీరక ఇబ్బందుల కంటే మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. ఆ గర్భాన్ని అలాగే కొనసాగిస్తే ఆమె చదువు ఆగిపోవడమే కాకుండా, సమాజంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఆమె భవిష్యత్తును చీకట్లోకి నెట్టేస్తాయి. అందుకే ఇక ఆమె ఫ్యూచర్ పాడవకూడదనే ఉద్దేశంతో, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ఉపయోగించుకునే హక్కు ఆమెకు ఉందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
తల్లి వేదనను గుర్తించిన కోర్టు:
ఈ కేసులో 15 ఏళ్ల బాలికకు ఏడు నెలల గర్భం ఉండగా, ఆమె తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాధారణంగా చట్టప్రకారం నిర్ణీత కాలం దాటిన తర్వాత అబార్షన్ చేయడం కష్టం. కానీ, ఇక్కడ పరిస్థితి తీవ్రతను కోర్టు అర్థం చేసుకుంది. ఒక తల్లిగా తన బిడ్డ పడుతున్న నరకాన్ని చూసి ఆమె వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించింది. ఇక వైద్య నివేదికలను పరిశీలించిన తర్వాత, గర్భం కొనసాగించడం వల్ల బాలిక ప్రాణానికే ప్రమాదం అనిపిస్తే ప్రాధాన్యతలు మారుతాయని కోర్టు పేర్కొంది.
మహిళా హక్కులకు పెద్దపీట:
ఇక ఈ తీర్పు మహిళల హక్కుల విషయంలో ఒక మైలురాయి లాంటిది. ఆడపిల్ల శరీరంపై పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం మరోసారి చాటి చెప్పింది. ఇష్టం లేని బాధ్యతను ఎవరిపై రుద్దలేమని, ముఖ్యంగా మైనర్ల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఇక సామాజిక కట్టుబాట్ల కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతత ముఖ్యమని ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతోంది.
