Begin typing your search above and press return to search.

ఏపీ Vs బిహార్ పోలీస్.. సునీల్ నాయక్ అరెస్టుపై కీలక ఆదేశాలు

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ6 నిందితుడు అయిన బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుకు గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గ

By:  Tupaki Desk   |   26 Feb 2026 2:55 PM IST
ఏపీ Vs బిహార్ పోలీస్.. సునీల్ నాయక్ అరెస్టుపై కీలక ఆదేశాలు
X

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ6 నిందితుడు అయిన బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుకు గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత సోమవారం బిహార్ రాజధాని పట్నాలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే తగిన వారెంటు లేకపోవడంతో ఆయనను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అక్కడి కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో సునీల్ నాయక్ ను అక్కడే వదిలి పోలీసులు రాష్ట్రానికి వెనుదిరగాల్సివచ్చింది. ఇది జరిగిన మూడు రోజులకే సునీల్ నాయక్ అరెస్టు కోసం కోర్టు నుంచి పోలీసులు అనుమతి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మరే ట్విస్టు చోటు చేసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.

బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు కోసం ఏపీ పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిప్యుటేషన్ పై రాష్ట్రంలో పనిచేసిన సునీల్ నాయక్ సీఐడీ డీఐజీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన కస్టడీలోనే నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రఘురామ ప్రభుత్వం మారిన తర్వాత గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో సునీల్ నాయక్ పేరు లేకపోయినా, ఇతర నిందితులు, సాక్ష్యుల వాంగ్మూలం ఆధారంగా సునీల్ నాయక్ ను ఏ6 నిందితుడిగా పోలీసులు చేర్చారు.

ఇక ఏపీ పోలీసుల చర్యలతో ముందే జాగ్రత్త పడిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం గుంటూరు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో గత సోమవారం విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం బిహార్ వెళ్లి పట్నాలో సునీల్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో చట్ట నిబంధనలను సక్రమంగా పాటించలేదని అక్కడి స్థానిక కోర్టు, మైకోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయకుండా సునీల్ నాయక్ ను విడిచి పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి.

ఈ నేపథ్యంలో పట్నా నుంచి తిరిగివచ్చిన ఏపీ పోలీసులు సునీల్ నాయక్ పై అరెస్టు వారెంటు జారీ చేయాలని గుంటూరు మొబైల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయాధికారి పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ సునీల్ నాయక్ అరెస్టుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మరోవైపు ప్రస్తుతం పట్నాలో ఉన్న సునీల్ నాయక్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆయన దేశం విడిచిపెట్టి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో ఏపీ పోలీసులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు.

దీంతో రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు ఏపీ పోలీస్ వర్సెస్ బిహార్ పోలీస్ గా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. గుంటూరు కోర్టు ఆదేశాలతో ఏపీ పోలీసులు బిహార్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే బిహార్ లో ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ కు అక్కడి పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెబుతున్నారు. దీంతో ఆయనను అరెస్టు చేసి తీసుకురావడం ఏపీ పోలీసులకు కత్తిమీద సాములా సవాల్ విసురుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం సునీల్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలు వెలువడక ముందే ఆయనను అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రఘురామ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.