ఇది ఏపీ పోలీసు రివేంజ్? బిహార్ లో దెబ్బకు రిటర్న్ గిఫ్ట్?
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 10 March 2026 7:00 PM ISTడిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైకోర్టు సూచనల ప్రకారం సునీల్ నాయక్ ను గత ఐదు రోజులుగా విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు అధికారుల బృందం విచారిస్తోంది. అంతేకాకుండా విచారణను మరో మూడు రోజులు పొడిగించింది. దీంతో బిహార్ లో ఎదురైన అవమానానికి రివేంజ్ తీర్చుకునేలా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా సిట్ పోలీసులు సునీల్ నాయక్ విచారణను కొనసాగిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బిహార్ లో సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన ఏపీ పోలీసు బృందానికి అక్కడ హోంగార్డులు ఇబ్బందులు సృష్టించారని, ఘర్షణ వైఖరి అవలంబించి కస్టడీలో ఉన్న సునీల్ నాయక్ ను తమతో తీసుకువెళ్లిపోయారని చెబుతున్నారు. అంతేకాకుండా ఓ మహిళా అధికారి ఇష్టానుసారం తిట్టారన్న ప్రచారం జరిగింది. దీనిపై రివేంజ్ తీర్చుకునేలా ప్రస్తుతం సునీల్ నాయక్ విచారణ కొనసాగుతోందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణను పరిశీలిస్తే గతంలో సిట్ అధికారులు ఎదుర్కొన్న పరాభవానికి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సునీల్ నాయక్ ను అరెస్టు చేయాలనే పట్టుదల పోలీసు అధికారుల్లో కనిపిస్తోందని, అందుకే బెయిలు తీర్పు వచ్చే వరకు విచారణను పొడిగిస్తూ వస్తున్నారని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రఘురామరాజు అరెస్టు సమయంలో సునీల్ నాయక్ డీఐజీగా ఉన్నారు. అప్పట్లో ఏం జరిగింది? సునీల్ నాయక్ కు ఏం తెలుసు అన్న విషయాలపై సుదీర్ఘంగా విచారణ జరుగుతోంది. అయితే ఇదే కేసులో నిందితుడు అయిన మరో సీనియర్ అధికారి పీ.వీ.సునీల్ కుమార్ ను కేవలం ఒక రోజు, అది కూడా కేవలం నాలుగు గంటల పాటు విచారించి వదిలేశారని గుర్తు చేస్తున్నారు. కానీ ఐపీఎస్ సునీల్ నాయక్ విషయంలో మాత్రం సిట్ పోలీసులు రోజుల తరబడి విచారణ కొనసాగించడమే ఇంట్రెస్టింగు డిస్కషన్ కు తెరతీస్తోంది. ఆయన వ్యవహారశైలిపై ఏపీ పోలీసు అధికారులు గుర్రుగా ఉన్నారని, అందుకే విచారణను సుదీర్ఘంగా కొనసాగిస్తూ తమ చుట్టూ సునీల్ నాయక్ తిరిగేలా చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బిహార్ రాజధాని పట్నాలో సునీల్ నాయక్ ను గతంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిబంధనలను చూపి ట్రాన్సిట్ వారెంట్ జారీ కాకుండా అక్కడి పోలీసులు సునీల్ నాయక్ ను ఏపీ తరలించకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో ఏపీ పోలీసులపై ఎదురు కేసులు పెట్టడం, ఒకానొక సమయంలో దాడికి ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. దీనిని స్థానిక కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పోలీసులు సునీల్ నాయక్ ను విచారించేందుకు అనుమతి తీసుకున్నారు. దీంతో ఈ నెల 5వ తేదీ నుంచి ఆయన రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు సీసీఎస్ పోలీసుస్టేషన్ లో విచారణకు హాజరవుతున్నారు. తొలుత 9వ తేదీవరకు సునీల్ నాయక్ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో మరో మూడు రోజులు సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు సూచించింది. దీంతో ఈ నెల 12వ తేదీ వరకు సునీల్ నాయక్ విచారణ కొనసాగుతుందని చెబుతున్నారు.
ఇదంతా పరిశీలిస్తే గతంలో విచారణకు హాజరుకాకపోవడం, బిహార్ లో తమకు సహకరించకపోవడాన్ని సిట్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కారణంగానే సీనియర్ అధికారిని విచారణ పేరుతో రోజూ తమ వద్దకు రప్పించుకుంటున్నారని అంటున్నారు. సునీల్ నాయక్ ముందస్తు బెయిలుపై హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో సునీల్ నాయక్ ముందస్తు బెయిలుపై తీర్పు వచ్చిన తర్వాత అరెస్టు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుని విచారణ ముగిస్తారని అంటున్నారు. దీంతో మరో రెండు రోజులు కూడా సునీల్ నాయక్ విచారణ కొనసాగుతుందని, 12వ తేదీన హైకోర్టు ఆదేశాలతో ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చని అంటున్నారు.
