Begin typing your search above and press return to search.

శ్రీకాళహస్తి మ*ర్డర్ కేసు.. నోరు విప్పిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సేన ఇన్చార్జి వినుత మాజీ పీఏ రాయుడు హత్య కేసుపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు.

By:  Tupaki Desk   |   17 July 2025 1:32 PM IST
శ్రీకాళహస్తి మ*ర్డర్ కేసు.. నోరు విప్పిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
X

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సేన ఇన్చార్జి వినుత మాజీ పీఏ రాయుడు హత్య కేసుపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. వినుత వద్ద పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారని, కొన్ని అభ్యంతరకర్త, వ్యక్తిగత వీడియోలను రాయుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పంపినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాయుడు హత్య జరగడం, అతడి శవాన్ని నిందితులు చెన్నైలో పారవేయడంతో అక్కడి పోలీసులు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జి వినుతతోపాటు ఆమె భర్త చంద్రబాబు, మరికొందరు అరెస్టు చేశారు. రాయుడు హత్యకు పరోక్షంగా సుధీర్ రెడ్డి కారణమయ్యారని విమర్శల నేపథ్యంలో ఆయన తాజాగా స్పందించారు.

గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తాను దేవుడి సన్నిధిలో నిజం చెబుతున్నానని రాయుడి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రాజకీయ కోణంలో తనపై వైసీపీ తీవ్ర అభాండాలు వేస్తోందని తెలిపారు. దేవుడు, కుటుంబం సాక్షిగా రాయుడు హత్య విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు శవం ఇటీవల చెన్నైలో లభించిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు రాయుడు శవాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయినట్లు అక్కడి పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ద్వారా గుర్తించారు. కేసు విచారణలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ చార్జి వినుత, ఆమె భర్త పాత్ర ఉన్నట్లు చెన్నై పోలీసులు తేల్చారు. నిందితులను అరెస్టు చేసి విచారించగా, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తూ తమకు ద్రోహం చేశాడనే కోపంతో హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలమిచ్చారని చెన్నై పోలీసు కమిషనర్ ప్రకటించారు. ఈ వ్యవహారం వెలుగుచూసిన వెంటనే జనసేన పార్టీ వినుతను బహిష్కరించింది. అయితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్లే ఈ హత్య జరిగిందని వైసీపీ విమర్శలు గుప్పించడం, జనసేన సోషల్ మీడియా కూడా ఈ విషయంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తుండటంతో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.